ఆమె ఇచ్చిన కానుకలు పోలీసులకు అప్పగింత!
రూ. 2.5 కోట్ల నగల వంచన కేసులో మలుపులు
దొడ్డబళ్లాపురం: శ్వేతా గౌడ అనే మహిళ మాజీ మంత్రి పేరు చెప్పుకుని బెంగళూరు కమర్షియల్ వీధిలో ఓ జ్యువెలరీ షాప్ నుంచి రూ. 2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని డబ్బు ఇవ్వకుండా టోకరా ఇచ్చిన కేసు మలుపు తిరిగింది. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో నోటీసులు అందుకున్న మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్ భారతినగర పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిందితురాలు.. ఆయన ముద్దుగా పిలుచుకునే గులాబ్ జామూన్.. శ్వేతాగౌడ ఇచ్చిన మొత్తం రూ.12.50 లక్షల విలువైన నగదు, గిఫ్ట్‌లు, బంగారు నగలను పోలీసు అధికారులకు అప్పగించారు. శ్వేతగౌడ ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఆమె అడగకుండానే కానుకలు ఇచ్చిందని పోలీసులకు వర్తూరు తెలిపారు. తన పేరు చెప్పగానే జ్యువెలరీ షాప్ యజమాని కోట్ల విలువైన నగలను ఆమెకు ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు.
ఫేస్‌బుక్‌లో పరిచయమై..
అయితే శ్వేతా గౌడ, వర్తూరు ప్రకాశ్ ఇద్దరూ సన్నిహితంగా ఉన్నారని, అనేకసార్లు మైసూరు చాముండి కొండకు వెళ్లారని, తిరుమల కొండకు వెళ్లడానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు తెలిసింది. ఇద్దరూ కలిసి మూడు నగల షాపుల్లో షాపింగ్ చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. 6 నెలల క్రితం శ్వేతాగౌడ వర్తూరుకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైందని, తరువాత వాట్సాప్, మెసెంజర్‌లలో ఘాటుగా చాటింగ్ చేసుకున్నారని, శ్వేతగౌడ మొబైల్ నంబర్‌ను గులాబ్ జామూన్ అని వర్తూరు ప్రకాశ్ సేవ్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
మరో ఆభరణాల మోసం..
యశవంతపుర: మాజీ ఎంపీ డికే సురేశ్ చెల్లినని చెప్పుకొంటూ మహిళ ఒకరు 14.6 కేజీల బంగారాన్ని కొనుగోలు చేసి మోసం చేసిన ఘటన బెంగళూరు ఆర్‌ఆర్ నగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఐశ్యర్య గౌడ, నటుడు ధమేంద్ర, హరీశ్ అనే వ్యక్తులపై కేసు నమోదైంది. ఐశ్వర్య.. ఓ నగల దుకాణానికి వెళ్లి 11 సార్లు బంగారాన్ని కొనుగోలు చేసి మాజీ ఎంపీ పేరు చెప్పి వెళ్లిపోయింది. దీంతో దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment