‘డీజిల్‌కి‌ డబ్బులివ్వు.. బిడ్డను వెతుకుతాం’ | UP Woman Looking for Daughter Accuses Cops | Sakshi

‘డీజిల్‌కి‌ డబ్బులివ్వు.. నీ బిడ్డను వెతుకుతాం’

Feb 2 2021 12:24 PM | Updated on Feb 2 2021 5:28 PM

UP Woman Looking for Daughter Accuses Cops - Sakshi

నీ కుమార్తె ఎలాంటిదో.. ఎవరితో వెళ్లిపోయిందో

లక్నో: సామాన్యులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే అధికారులు.. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో.. ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మంది జనాలు పోలీసుల ప్రవర్తనకు జడిసి స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడతారు. ఇక ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. తప్పకుండా ఖాకీల చేతులు తడపాల్సిందే. లేదంటే మన కంప్లైంట్‌ పక్కకు పడేస్తారు. అందరు ఇలానే లేకపోయినా.. చాలా చోట్ల మాత్రం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి యూపీలో చోటు చేసుకుంది. కిడ్నాపయిన తన బిడ్డను విడిపించాల్సిందిగా కోరుతూ.. పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఓ మహిళ పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారు. వికలాంగురాలు అని కూడా చూడకుండా.. ఆమె వద్ద నుంచి 15 వేల రూపాయల వరకు వసూలు చేశారు. కానీ ఫిర్యాదును మాత్రం పట్టించుకోలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే.. కుమార్తె క్యారెక్టర్‌ గురించి అసభ్యంగా మాట్లాడారు. పోలీసులు నిర్లక్ష్యాన్ని భరించలేని ఆ తల్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
(చదవండి: ప్రేమికుల కిడ్నాప్‌.. సినిమాను తలపించేలా )

వివరాలు..  కాన్పూర్‌కు చెందిన గుడియా అనే వికాలంగురాలి భర్త చనిపోయాడు. మైనర్‌ కుమార్తెతో కలిసి ఉన్న కొద్ది పాటి భూమిని సాగు చేసుకుని జీవిస్తోంది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం గుడియా మైనర్‌ కుమార్తెని ఆమె బంధువు ఒకరు కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి తన ఇంట్లో బంధించాడు. దాంతో గుడియా పోలీస్‌ స్టేషన్‌లో దీని గురించి ఫిర్యాదు చేసింది. ఇక ఆమె కుమార్తెని వెతికాలంటే డీజిల్‌ ఖర్చు భరించాల్సిందిగా పోలీసులు గుడియాకు తెలిపారు. అందుకు అంగీకరించిన ఆ తల్లి బంధువుల దగ్గర అప్పు తెచ్చి మరి డీజిల్‌ ఖర్చులకు గాను 15 వేల రూపాయలు చెల్లించింది. ఇలా మూడు నాలుగు సార్లు డబ్బులు ఇచ్చిన్నప్పటికి ఫలితం మాత్రం శూన్యం. కుమార్తె గురించి ప్రశ్నిస్తే.. వెతుకుతున్నాం అంటూ సమాధానమిచ్చేవారు. ఆ తర్వత అసలు రెస్పాన్స్‌ లేదు. 
(చదవండి: కృష్ణుని కోసం ప్రాణాలు తీసుకున్న రష్యన్‌ యువతి)

దాంతో గుడియా అధికారులను నిలదీయగా.. వారు ఆమె పట్ల ఏ మాత్రం జాలీ, దయ లేకుండా.. ‘‘ఇక్కడ నుంచి వెళ్లు.. అసలు నీ కుమార్తె ఎలాంటిదో.. ఎవరితో వెళ్లిపోయిందో’’ అంటూ నీచంగా మాట్లాడారు. ఇక తట్టుకోలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను అన్నది గుడియా. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓను విధుల నుంచి తొలగించడమేకాక మరో అధికారిని నియమించి గుడియా కంప్లైంట్‌ మీద యాక్షన్‌ తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇక గుడియాను పోలీసు వాహనంలో తీసుకెళ్లి ఆమె ఇంటి వద్ద వదిలేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement