లక్నో: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నలుగురికి నిర్ధారణ కాగా.. తాజాగా మరో అనుమానిత కేసు బయటపడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాకు చెందిన ఓ మహిళలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ మహిళలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. నమూనాలు సేకరించి లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి పంపించారు.
అప్రమత్తమైన యూపీ ప్రభుత్వం..
రాష్ట్రంలో అనుమానిత మంకీపాక్స్ కేసు బయటపడిన క్రమంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో మంకీపాక్స్ కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అన్ని ఆసుపత్రులు కట్టుబడి ఉండాలని పేర్కొంది. మరోవైపు.. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం మంకీపాక్స్‌పై నిఘా పెంచాలని అధికారులకు సూచించింది.
విమానాశ్రయాల్లో స్క్రీనింగ్..
ఇప్పటి వరకు దేశంలో నమోదైన నాలుగు కేసుల్లో మూడు కేరళలోనే వెలుగు చూశాయి. ఢిల్లీలో ఒక కేసు వచ్చింది. కేరళ, ఢిల్లీలలో కేసులు వచ్చిన క్రమంలో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా పెంచాయి. మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాల గుండా దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలపై జులై 18న కీలక సూచనలు చేసింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ.
ఇదీ చదవండి: Toxic Liquor: కల్తీ మద్యం తాగి 21 మంది కూలీలు మృతి
Comments
Please login to add a commentAdd a comment