ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటకు వచ్చారు. వీరిని బయటకు తీసుకురావడంలో ర్యాట్ మైనర్ల బృందం విజయం సాధించింది.
ఉత్తరకాశీ సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులలో ఒకరైన సుబోధ్ కుమార్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ‘తాము టన్నెల్‌లో ఆహారం కోసం అలమటించిపోయామని, గాలి ఆడక ఇబ్బంది పడ్డామన్నారు. తరువాత అధికారులు పైపుల ద్వారా ఆహార పదార్థాలను పంపించారన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్య లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠోర శ్రమ కారణంగానే తాను బయటపడగలిగానని’ తెలిపారు.
మరో కార్మికుడు విశ్వజీత్ కుమార్ వర్మ మాట్లాడుతూ ‘తాము సొరంగంలో చిక్కుకున్నామని తెలుసుకున్నామని, బయట అధికారులు తమను బయటకు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నించారు. మాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్‌తో పాటు ఆహారం అందించారు. మేము టన్నెల్‌లో చిక్కుకున్న మొదటి 10 నుంచి 15 గంటలు సమస్యలను ఎదుర్కొన్నాం. తరువాత ఆహారాన్ని పైపుల ద్వారా అందించారు. అనంతరం మైకు అమర్చి, కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. ఇప్పుడు తామంతా సంతోషంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.
నవంబర్ 12వ తేదీ తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో సొరంగంలో ప్రమాదం జరిగి 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. తరువాత వారికి అధికారులు ఒక పైపు ద్వారా మందులు, డ్రై ఫ్రూట్స్ పంపించారు. నవంబర్ 20న ఆరు అంగుళాల పైపును సొరంగంలోనికి పంపి కిచ్డీతో పాటు అరటిపండ్లు, నారింజ, డ్రైఫ్రూట్స్, బ్రెడ్, బ్రష్‌లు, టూత్‌పేస్టులు, మందులు, అవసరమైన దుస్తులను వారికి పంపించారు. ఎట్టకేలకు 17 రోజుల అనంతరం కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
ఇది కూడా చదవండి: సొరంగం నుంచి వచ్చిన కుమారుడుని చూడకుండానే తండ్రి మృతి
Comments
Please login to add a commentAdd a comment