సాక్షి, బెంగళూరు (బనశంకరి): మనిషి బలహీనతే వారికి పెట్టుబడి. వల విసిరి లోబర్చుకుని ఆపై డబ్బూ దస్కం దోచుకోవడం పరిపాటిగా మారింది. సిలికాన్ సిటీలో హానీట్రాప్ దందాలు పెచ్చుమీరుతున్నాయి. సులభంగా బెదిరించి డబ్బులు దండుకోవడానికి దీనిని ఎంచుకుంటున్నారు. అలాగే టెక్నాలజీ సాయంతో అమాయక ప్రజలను నిలువునా దోచేస్తున్నారు.
పనిలో చేరి వలలో వేసుకుని
వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న యువతి వస్త్ర వ్యాపారితో స్నేహంగా ఉంటూ తన సోదరులతో కలిసి హనీట్రాప్ కు పాల్పడి రూ.43 లక్షలు దోచేసింది. ఈఘటన బాధితుడు నగర్తపేటే నివాసి విక్రంజైన్ (43) అనే వస్త్రవ్యాపారి ఉప్పారపేటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి మైత్రి, ఆమె సోదరుడు కిరణ్, స్నేహితుడు సిద్దు అనే ముగ్గురిపై దర్యాప్తు చేపడుతున్నామని ఉప్పారపేటే పోలీసులు తెలిపారు. జైన్ 2020లో మైత్రి అనే యువతిని షాపులో పనికి చేర్చుకున్నాడు. ఈ సమయంలో యువతి తన సోదరుడు కిరణ్ రోడ్డుప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరాడని, డబ్బు కావాలని జైన్ నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకుంది.
తరువాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొద్దిరోజుల తరువాత జైన్‌కు మైత్రి ఫోన్ చేసి కేజీ.రోడ్డు బెంగళూరు గేట్ హోటల్‌కు రావాలనడంతో జైన్ వెళ్లాడు. హోటల్‌లో మైత్రి, కిరణ్, సిద్దు ఉన్నారు. రూ.8 లక్షలు ఇవ్వాలని, లేకపోతే మన ఇద్దరి మధ్య ఉన్న శారీరక సంబంధం గురించి ప్రచారం చేసి పరువు తీస్తానని బెదిరించింది. భయపడిన జైన్ వారికి రూ.8 లక్షలు అందజేశాడు. ఆ తరువాత కూడా దశలవారీగా వారు అతని నుంచి రూ.43 లక్షలు దోచేశారు. మరింత డబ్బు కోసం వేధిస్తుండడంతో తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పాన్‌కార్డు పేరుతో రూ.3.22 లక్షలు వంచన
పాన్‌కార్డు అప్‌డేట్ చేయకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని బ్యాంక్ సిబ్బంది ముసుగులో మహిళకు రూ.3.22 లక్షలు సైబర్ వంచకులు టోపీ వేశారు. జేపీ.నగరలో చంద్రిక (64)కు ఈ నెల 8 తేదీన గుర్తుతెలియని నెంబరు నుంచి చంద్రికాకు ఫోన్ వచ్చింది. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం, మీ పాన్‌కార్డును అప్‌డేట్ చేయాలి, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది అని చెప్పారు. సరేనని చంద్రిక బ్యాంక్ అకౌంట్ వివరాలను పంపగానే ఆమె ఖాతా నుంచి ను రూ.3.22 లక్షలు నగదు కట్ అయింది. ఆమె లబోదిబోమంటూ బ్యాంకుకు వెళ్లి విచారించగా ఇది సైబర్ వంచకుల పని అని తెలిసి సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసింది.
చదవండి: (Hyderabad: పదోతరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం)
లింక్ నొక్కి చూసినందుకు రూ.6.24 లక్షలు స్వాహా
మొబైల్‌కు వచ్చిన ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేసి నగ్నవీడియో చూసి బ్లాక్‌మెయిల్‌కు గురైన వృద్దుడు రూ.6.24 లక్షలు పోగొట్టుకున్నాడు. బీటీఎం.లేఔట్‌లో ఉండే 75 ఏళ్ల వృద్ధుడు బాధితుడు. ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు వంచకులైన సౌరవ్, బల్‌జిత్ రై, రేష్మా అనే ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. వృద్దుని మొబైల్ కు అక్టోబరులో గుర్తుతెలియని వ్యక్తి నుంచి లింక్ వచ్చింది. కుతూహలంతో లింక్‌పై క్లిక్‌చేసి యువతి వీడియోను కొద్దిసేపు వీక్షించాడు. ఈ తతంగాన్ని దుండగులు స్క్రీన్‌షాట్లు తీసుకున్నారు. తరువాత బాధితునికి ఫోన్ చేసి నువ్వు ఓ యువతితో అశ్లీలంగా ఉన్న మీ వీడియో మా వద్ద ఉందని బెదిరించారు. అతని నుంచి దశలవారీగా రూ.6.24 లక్షలను తమ అకౌంట్లకు బదిలీ చేయించుకున్నారు. డబ్బు కోసం మళ్లీ ఒత్తిడి చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితుల కోసం గాలింపు సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment