మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు సుభాష్ చంద్రబోస్, చింతా అనూరాధ, నందిగం సురేశ్, వంగా గీత, సత్యవతి, మాధవి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు, పార్టీ ఫిరాయింపులపై పార్లమెంటు ఉభయసభల్లో చర్చను కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వంగా గీత శుక్రవారం ఈమేరకు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం తాము ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా చర్చకు పట్టుపట్టుతూ తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు. వివిధ పక్షాల ఆందోళనలతో ఉభయ సభలు పలుమార్లు వెంటవెంటనే వాయిదాపడ్డాయి. ఆయా అంశాలపై వచ్చేవారం చర్చకు అనుమతిస్తామని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారని సభ అనంతరం మీడియా సమావేశంలో ఎంపీలు వెల్లడించారు.
రాజ్యసభలో..
పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధుల విడుదలపై జరుగుతున్న జాప్యంపై చర్చకు అనుమతించాలంటూ రూల్ 267 కింద వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలును అనుసరించి పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు అనుమతించాలని రూల్ 267 కింద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నోటీసు ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 90(1) ప్రకారం పోలవరం సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2022 ఖరీఫ్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను జలశక్తిశాఖ సాంకేతిక కమిటీ ఆమోదించినా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.1,917 కోట్లు ఇంకా రీయింబర్స్ చేయకపోవడం, ఇతరత్రా అంశాల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతోంది’ అని పేర్కొంటూ శుక్రవారం సభ కార్యకలాపాలు రద్దుచేసి ఈ అంశంపై చర్చ చేపట్టాలని ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసులో పేర్కొన్నారు.
‘ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండాలి. ఎవరైనా చట్ట సభ్యుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ.. ఏ గుర్తుపై పోటీచేసి గెలిచారో ఆ పార్టీ అధినేతపై విమర్శలు చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య సూత్రాలను అణగదొక్కడం వంటిదే. సదరు సభ్యుడు ఎన్నికల అనంతరం ప్రజాస్వామ్య సూత్రాలను దుర్వినియోగం చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సభాపతి లేదా చైర్మన్‌కు సదరు సభ్యుడిపై అనర్హత వేటు వేయాలని మెమొరాండం, పిటిషన్ ఇచ్చి కోరితే దానిపై నిర్ణయం తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో సభలో ఈ అంశంపై ఎలాంటి ఆలస్యం చేయకుండా చర్చించాలి’ అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తాను ఇచ్చిన నోటీసులో కోరారు.
లోక్‌సభలో..
ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై రూల్ 193 కింద స్వల్పకాలిక చర్చ కోరుతూ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి నోటీసు ఇచ్చారు. అయితే శుక్రవారం ఉభయసభలు వివిధ పక్షాల ఆందోళనతో పలుమార్లు వాయిదాపడ్డాయి.
కేంద్రప్రభుత్వం వ్యాపారసంస్థలా వ్యవహరించరాదు
వైఎస్సార్‌సీపీ ఎంపీలు బోస్, గీత, సురేశ్, అనూరాధ, సత్యవతి, మాధవి
పార్లమెంటు ఉభయసభల్లోను వచ్చే వారంలో పోలవరంపై చర్చ జరగనుందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు తెలిపారు. పోలవరంపై చర్చకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అంగీకరించారని చెప్పారు. న్యూఢిల్లీలోని విజయ్‌చౌక్‌లో శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వంగా గీత, నందిగం సురేశ్, చింతా అనూరాధ, బి.వి.సత్యవతి, గొడ్డేటి మాధవి మీడియాతో మాట్లాడారు. పోలవరంపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతోందని సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అన్న విషయం కేంద్రం మరిచినట్టు ఉందన్నారు. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, సవరించిన అంచనాల ప్రకారం నిధుల విడుదల్లో జరుగుతున్న జాప్యంపై ఇటు రాజ్యసభలోను, అటు లోక్‌సభలోను చర్చకు అనుమతి కోరుతూ నోటీసులు ఇచ్చాం.
పోలవరంపై చర్చకు రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కూడా అంగీకరించారు. విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయస్థాయి హోదా ఉన్న ప్రాజెక్టు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోతున్నట్టు ఉంది. పోలవరానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని పెండింగ్‌లో పెట్టడం చాలా దురదృష్టకరమైన అంశం. తక్షణమే ప్రాజెక్టుకు సవరించిన అంచనా నిధులు విడుదల చేయాలి. సవరించిన అంచనా ప్రకారం రూ.55,656.87 కోట్లు విడుదల చేసే అంశం, రెండేళ్లకు పైగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయాల్సిన పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం, ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి అడుగుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వచ్చినప్పుడల్లా కేంద్రం దృష్టికి నిధుల సమస్యను తీసుకెళుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. లోక్‌సభలో పార్టీ పక్షనేత మిథున్‌రెడ్డి, రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పలుసార్లు సంబంధిత మంత్రులను కలిసి వివరించినప్పటికీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం చాలా దురదృష్టకరం. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను ఆమోదించమని, టెక్నికల్ కమిటీ, సీడబ్ల్యూసీ, పీపీఏ ఆమోదం తెలిపి సంవత్సరాలు గడుస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ పోలవరంపై సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా నిధులను కూడా కేంద్రం పెండింగ్‌లో పెట్టింది.
పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖ నగరానికి, విశాఖపట్నం పరిసర గ్రామాలకు మంచినీరు సరఫరాకు సంబంధించిన పనులకు దాదాపు రూ.4 వేల కోట్ల నిధులు ఇవ్వం, కేవలం సాగునీటికే ఇస్తాం అని కేంద్రం అనడం తప్పు. ఈ విషయాన్ని పలుసార్లు ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ప్రభుత్వాలు అనేవి లాభాలతో నడిచే సంస్థలు కాదు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి సహాయ, సహకారం చేసే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఏదో వ్యాపారసంస్థల్లా చేయడం మంచిది కాదు. పోలవరం ప్రాజెక్టులో అతి ప్రధానమైనవి ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ. ఇవన్నీ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే రోజుకి కేంద్రం క్లియర్ చెయ్యాలి. అప్పుడే పోలవరం ప్రాజెక్టును సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఖరీఫ్ 2022 కల్లా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రైతుల ప్రయోజనార్థం ప్రాజెక్టు నుంచి వచ్చే ఖరీఫ్‌లో నీళ్లు ఇస్తామని మాట కూడా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అడ్మినిస్టేటివ్ ఆఫీసు పోలవరం ప్రాజెక్టుకు ఎక్కడో దూరంగా హైదరాబాద్‌లో ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో పెట్టాలని కేంద్రాన్ని కోరాం’ అని పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు.
పోలవరం నిర్వాసితులకు తక్షణం పునరావాసం కల్పించాలి
ఎంపీ వంగా గీత మాట్లాడుతూ అనేక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరానికి జీవం పోసి ఓ రూపాన్ని ఇచ్చారని చెప్పారు. విభజన చట్టంలో భాగంగా> పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 15–17 సార్లు కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తులు చేసినా పోలవరం నిధుల విడుదలపై జాప్యం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి గిరిజనుల మీద ప్రేమ లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు తక్షణమే పునరావాసం కల్పించాలని ఆమె డిమాండు చేశారు. తిరుపతి బహిరంగసభలో ప్రధాని మోదీ ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంట్ సాక్షిగా ఒక ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఇంతవరకు నెరవేరలేదని, పార్లమెంట్‌లో ఇచ్చిన హామీకే విలువ లేకపోతే ప్రజాస్వామ్యానికే విలువ లేనట్లని పేర్కొన్నారు. ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరికాదని, ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయకుండా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలు, రైతుల తరఫున రోజూ పార్లమెంట్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment