యువతి - జొమాటో డెలివరీ బాయ్ వివాదంలో కొత్త ట్విస్ట్ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)
బెంగళూరు: గత కొద్ది రోజులుగా యువతి-జొమాటో డెలివరీ బాయ్‌ల మధ్య వివాదానికి సంబంధించిన వార్తలు వెలుగు చూస్తున్నాయి. ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడంతో ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన మహిళా కస్టమర్‌పై జొమాటో డెలివరీ బాయ్ దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సదరు డెలివరీ బాయ్ కామరాజ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ మీద విడుదలైన కామరాజ్ సదరు యువతిపై కేసు పెట్టాడు. తనపై ఏ పోలీస్ స్టేషన్‌లో అయితే కేసు నమోదయ్యిందో.. అదే పీఎస్‌లో ఆమెపై కేసు పెట్టాడు.
ఈ సందర్భంగా కామరాజ్ మాట్లాడుతూ.. ‘‘నేను సదరు యువతిపై ఎలాంటి దాడి చేయలేదు. డెలివరీ ఆలస్యం అయినందుకు నేను ఆమెకు క్షమాపణలు కూడా చెప్పాను. ఆర్డర్ క్యాన్సిల్ అయినందున ఫుడ్ తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరాను. కానీ ఆమె అంగీకరించలేదు. పైగా నన్ను అసభ్య పదజాలంతో దూషించింది. నా మీదకు షూ విసిరింది. ఈ క్రమంలో అనుకోకుండా తనను తానే గాయపర్చుకుంది. చివరకు నేను ఆమెపై దాడి చేశానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ఆమె నన్ను అసభ్య పదజాలంతో దూషించి.. అవమానించింది. అందుకే ఆమెపై కేసు పెట్టాను’’ అన్నాడు.
కామరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యువతి మీద ఐపీసీ 341, 355, 504 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సదరు యువతి మాత్రం ‘‘ముందు నేను డెలివరీ బాయ్‌ను తిట్టలేదు. ఫస్ట్ అతనే చాలా రూడ్‌గా ప్రవర్తించాడు. ఆ భయంలో, కంగారులో నేను అతడిని తిట్టాను. అంతే తప్ప కావాలని అతడిని దూషించలేదు.. అవమానించలేదు’’ అని తెలిపారు. ఇక ఈ వివాదంపై సోషల్ మీడియా జనాలు రెండుగా విడిపోయారు. కొందరు సదరు యువతికి మద్దతు ఇస్తుండగా.. మరికొందరు మాత్రం డెలివరీ బాయ్‌ను సపోర్ట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment