బిడ్డ జ్ఞాపకార్థం.. గుర్తుగా లైబ్రరీ.. | - | Sakshi
Sakshi News home page

బిడ్డ జ్ఞాపకార్థం.. గుర్తుగా లైబ్రరీ..

Published Thu, Jul 27 2023 7:40 AM | Last Updated on Thu, Jul 27 2023 2:07 PM

- - Sakshi

నిర్మల్‌: అల్లారుముద్దుగా పెంచిన బిడ్డ అర్ధంతరంగా దూరమైంది. తనలాగే సమాజానికి వైద్యసేవలందిస్తుందని డాక్టర్‌ను చేస్తే.. తానే ముందుగా వెళ్లిపోయింది. ఆ బిడ్డను మర్చిపోని తండ్రి ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తన బిడ్డలా పేద విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని, సామాజిక సేవలో భాగమయ్యారు. తన కుమార్తె ‘కావేరి’ పేరిట జిల్లాకేంద్రానికి చెందిన పిల్లల వైద్యుడు అప్పాల చక్రధారి అధునాతన లైబ్రరీ ఏర్పాటు చేశారు. తన బిడ్డను తలచుకుంటూ ఎంతోమంది విద్యార్థులకు సేవలందిస్తున్నారు.

2017 నుంచే గ్రంథాలయం..

జిల్లాకేంద్రంలోని డాక్టర్స్‌లైన్‌, తిరుమల థియేటర్‌ ఎదురుగా గల తన నివాసంలోనే 2017లో కావేరి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దినపత్రికలు, ఇతర పుస్తకాలతో పాటు పోటీపరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ మొత్తం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతూ వచ్చారు.

ఆన్‌లైన్‌ ద్వారా సమాచారం తెలుసుకునేందుకు ఇంటర్‌నెట్‌తో కూడిన కంప్యూటర్లు అందుబాటులో ఉంచారు. దాదాపు ఆరేళ్ల కాలంలో ఇక్కడ ప్రిపేరవుతున్న వారిలో పదులసంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని చక్రధారి చెబుతున్నారు.

మరింత అధునాతనంగా..

తన కూతురు ఎప్పుడూ నిర్మల్‌లో అన్నిరకాల సౌకర్యాలతో ఆస్పత్రి, లైబ్రరీ ఇలా అన్నీ ఉండాలని కోరుకునేదని డాక్టర్‌ చక్రధారి పేర్కొన్నారు. ఆమె కోరిక మేరకే ఆస్పత్రి, కావేరి కుటీరాన్ని నిర్మించారు. ఈమేరకు అధునాతన లైబ్రరీని సిద్ధం చేశారు. ఏడాది క్రితం తన ఇంటిని పూర్తిగా కూల్చేశారు. అందులో ఉన్న లైబ్రరీని డాక్టర్స్‌లైన్‌లోనే వేరే భవనంలో కొనసాగించారు.

అదేస్థానంలో అధునాతనంగా, పూర్తిసౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించారు. విద్యార్థులు, అభ్యర్థులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో తను ఉండాల్సిన ఇల్లు కంటే ముందే లైబ్రరీ భవనాన్ని పూర్తిచేయించారు. నూతన గ్రంథాలయ భవనాన్ని గురువారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

ఇవీ.. సౌకర్యాలు

రాష్ట్రంలోనే పూర్తి ఉచితంగా అధునాతన సౌకర్యాలతో ఉన్న ఏకై క లైబ్రరీగా కావేరి గ్రంథాలయాన్ని చె బుతుంటారు. ఇందులో విశాలమైన గదుల్లో రీడింగ్‌ రూములున్నాయి. అన్ని దినపత్రికలు, పోటీపరీక్షల పూర్తి మెటీరియల్‌ ఉంది. పాఠకులు, అభ్యర్థులు కో రితే వెంటనే సంబంధిత మెటీరియల్‌ తెప్పించి ఇ స్తారు.

స్త్రీ, పురుషులకు వేర్వేరుగా రీడింగ్‌ రూములు న్నాయి. మాక్‌టెస్టులు, ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించడానికి హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌తో అధునాతన కంప్యూటర్ల గది ఉంది. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, మోటివేషన్‌ క్లాసుల కోసం ప్రత్యేకంగా ప్రొజెక్టర్‌ ఏర్పాటు చేశారు. పాఠకులు, అభ్యర్థులు భోజనం చేయడానికి ప్రత్యేకంగా డైనింగ్‌హాల్‌ నిర్మించారు.

చాలా సంతృప్తినిస్తోంది

నా బిడ్డ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం ద్వారా ఎంతోమంది విద్యార్థులు, అభ్యర్థులు లబ్ధి పొందడం, ఉద్యోగాలు సాధించడం చాలా సంతృప్తినిస్తోంది. ప్రిపరేషన్‌ కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని అధునాతన సౌకర్యాలు కల్పించాం. అభ్యర్థులకు ఎప్పటికప్పుడు కొత్త మెటీరియల్‌ తెప్పిస్తున్నాం. – డాక్టర్‌ చక్రధారి, కావేరి లైబ్రరీ చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement