మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
దిలావర్‌పూర్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని మాడేగాం అనుబంధ గ్రామమైన కదిలికి చెందిన ధానూర్ పాపన్న (34) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవలు చేసేవాడు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి పాపాన్న.. ఆలయానికి వెళ్తాడని కుటుంబ సభ్యులు భావించారు. వెళ్లకుండా ఇంటి ఎదుట చెట్టుకు ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం భార్య గంగాసాగర, కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు 10 సంవత్సరాల లోపు కుమారులు ఉన్నారు.
చేపల వేటకు వెళ్లి జాలరి మృతి
దిలావర్‌పూర్: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని జాలరి మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని సముందర్‌పల్లి అనుబంధ గ్రామమైన కాండ్లికి చెందిన కొత్తూరు భోజన్న (59) గురువారం ఉదయం గ్రామానికి ఆనుకుని ఉన్న ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ వద్ద చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో వల చుట్టుకుని మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని దిలావర్‌ఫూర్ ఎస్సై సందీప్ పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
బోథ్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ఎల్.ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం.. సొనాల మండల కేంద్రానికి చెందిన బొంపాల పోశెట్టి చేనులో పనినిమత్తం బుధవారం అదే గ్రామానికి చెందిన షేక్ ఇసాక్ వెళ్లాడు. పని ముగించుకుని సాయంత్రం పోశెట్టి బైక్‌పై ఇసాక్‌తో సొనాల గ్రామానికి వస్తున్నారు. సాయంత్రం టివిటి క్రాస్‌రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ వేగంగా ఢీకొట్టింది. పోశెట్టి వెనకాల కూర్చున్న ఇసాక్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య షాహినాజ్ బేగం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనాథ శవానికి అంత్యక్రియలు●
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో అనాథ శవానికి పోలీసులు, మున్సిపల్ సిబ్బంది దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. టూటౌన్ ఎస్సై కె.మహేందర్ కథనం ప్రకారం.. పల్లపు రాజు (44) బెల్లంపల్లి కాల్‌టెక్స్ ఏరియాలో గత కొంతకాలం నుంచి రోడ్డుపై పడేసిన చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ కవర్లు ఏరుకుని జీవనం సాగిస్తూ రోడ్డుపై నిద్రిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం రామకృష్ణ థియేటర్ ముందు రోడ్డుపై రాజు అకస్మికంగా పడిపోయాడు. గమనించిన మహిళ 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే టూటౌన్ కానిస్టేబుల్ రాజీవ్ రతన్, హోంగార్డు సంపత్ ఘటనాస్థలికి చేరుకుని రాజును పరిశీలించి మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మద్యం తాగడంతో రాజు మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి ఎవరూ లేకపోవడంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు, మున్సిపల్ సిబ్బందిని ఎస్సై మహేందర్ అభినందించారు.
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment