పోలింగ్‌ ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ ప్రశాంతం

Published Fri, Feb 28 2025 1:20 AM | Last Updated on Fri, Feb 28 2025 1:18 AM

పోలిం

పోలింగ్‌ ప్రశాంతం

నిర్మల్‌: ఉపాధ్యాయులు ఓటెత్తారు.. పట్టభద్రులు పోటెత్తారు. మొత్తం మీద రికార్డుస్థాయిలో ఓటు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ పోలింగ్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో భాగంగా జిల్లాలో 46పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 8గంటలకే పోలింగ్‌ ప్రారంభం కాగా, సాయంత్రం 4గంటల వరకు కేంద్రాల్లో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతించారు. చాలా కేంద్రాల్లో పోలింగ్‌ మందకొడిగా సాగడంతో రాత్రి వరకూ పోలింగ్‌ కొనసాగింది. పలు కేంద్రాల్లో పోలింగ్‌ నెమ్మదిగా సాగడంపై పలువురు పట్టభద్రులు, టీచర్లు అసహనం వ్యక్తంచేశారు. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్పీ జానకీ షర్మిల, అడిషనల్‌ కలెక్టర్లు, ఏఎస్పీలు జిల్లాలోని వివిధ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఓటింగ్‌ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు. దివ్యాంగులతో సహా ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది సహకరించారు.

మందకొడిగా ప్రారంభమై..

ఎమ్మెల్సీ ఎన్నిక ఉదయం 8గంటలకే ప్రారంభమైంది. ఒకరోజు ముందు శివరాత్రి పర్వదినం ఉండటం పోలింగ్‌పై కాస్త ప్రభావం చూపింది. పర్వదినాన రాత్రంతా జాగారం, ఉదయాన్నే ఉపవాసాలు వీడటం క్యాక్రమాలు ఉండటంతో చాలామంది ఉదయం వేళల్లో రాలేదు. 10గంటల తర్వాత నుంచే క్రమంగా ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ కేంద్రాల్లో బారులు తీరారు. అధికారులు ప్రతీ రెండు గంటలకోసారి ఓటింగ్‌శాతాన్ని వెల్లడించారు.

‘ఉపాధ్యాయ’ ఉత్సాహం

పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలో 17,141మంది పట్టభద్రుల ఓటర్లుండగా 12,442 మంది ఓటేశారు. పోలింగ్‌ 72.59శాతంగా నమోదైంది. టీచర్లతో పోలిస్తే గ్రాడ్యుయేట్స్‌ కాస్త నిరాశపర్చారు. జిల్లాలో 1,966 మంది మాత్రమే ఉన్న ఉపాధ్యాయులు ఉత్సాహంగా కనిపించారు. 1,755 మంది ఓటు వేయగా 89.27శాతంగా పోలింగ్‌ నమోదు కావడం విశేషం. టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థితో పాటు పట్టభద్రుల అభ్యర్థికీ ఉపాధ్యాయులు ఓటేశారు. రెండు పోలింగ్‌బూత్‌లు వేర్వేరు చోట్ల ఉన్నా.. రెండుచోట్లకు వెళ్లి, దాదాపు గంటకు పైగా లైన్లలో ఓపికతో వేచి ఉండి మరీ ఓటేశారు. ఎండ వేడిని కూడా లెక్క చేయకుండా చాలామంది మధ్యాహ్నం వేళలోనే ఓటు వేయడానికి వచ్చారు.

ఉపాధ్యాయ సంఘాల హల్‌చల్‌

రాజకీయంగా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు సందడిగా ఉంటాయి. కానీ.. జిల్లాలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. రాజకీయ పార్టీల కన్నా.. ఉపాధ్యాయ సంఘాలే హల్‌చల్‌ చేశాయి. పార్టీ నాయకుల కన్నా ఈ సంఘాల నేతల సందడి కనిపించింది. ఓటర్లను గుర్తించడం, వారిని ఓటు వేసేందుకు రప్పించడంలో సంఘాలు కీలకపాత్ర పోషించాయి. ఈ మేరకే ఉపాధ్యాయ పోలింగ్‌శాతం అధికంగా నమోదైంది. ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉపాధ్యాయ సంఘాలు టెంట్లు వేసుకుని మరీ కూర్చున్నాయి. సంఘాల వారీగా ఓటర్లకు తమ మద్దతు ఉన్న అభ్యర్థిని గెలిపించాలంటూ నూరిపోశాయి. ఇక పట్టభద్రుల స్థానానికి పోటీ పడుతున్న కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులకు ఆయా పార్టీల స్థానిక నాయకులు అండగా నిలిచారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద నుంచి ఓటర్లను రప్పించడం, ఓటేయించడం చేశారు. బీఎస్పీ నుంచి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి బరిలో ఉన్నా.. వారికి సంబంధించిన నేతలు పెద్దగా కనిపించలేదు.

ఓటేసిన ముఖ్యులు..

జిల్లాకు చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో, డీసీసీ అ ధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు మామడ ప్రభుత్వ ఉ న్నత పాఠశాలలో ఓటు వేశారు. బీఎస్పీ టీచర్‌ ఎ మ్మెల్సీ అభ్యర్థి యాటకారి సాయన్న, స్వతంత్ర అ భ్యర్థి నంగె శ్రీనివాస్‌ జిల్లాకేంద్రంలో ఓటేశారు. బీ జేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్‌ ఆదిలాబాద్‌ జి ల్లా ఉట్నూర్‌లో ఓటు వేయగా, బీజేఎల్పీ నేత మ హేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉండటం గమనార్హం.

కేంద్రాలను పరిశీలిస్తూ..

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చే యడానికి యంత్రాంగమంతా శ్రమించింది. ప్రధానంగా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్పీ జానకీ ష ర్మిల తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలు వి జయవంతం చేశారు. కలెక్టర్‌, ఎస్పీ, అడిషనల్‌ కలెక్టర్లు, ఏఎస్పీలు జిల్లావ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి

89.27 శాతం నమోదైన పోలింగ్‌

పట్టభద్రుల స్థానానికి 72.59 శాతం

కేంద్రాలను పరిశీలించిన అధికారులు

ఓటేసిన అంధుడు

నర్సాపూర్‌(జి): అవయవాలన్నీ సక్రమంగా ఉన్నా ఓటు వేయడానికి కొందరు పట్టభద్రులు బద్ధకిస్తుంటారు. అంధుడైన పట్టభద్ర ఓటరు చెల్లెలి సహకారంతో ఓటు వేసి ఆదర్శంగా నిలిచాడు. నర్సాపూర్‌ (జి) మండల కేంద్రానికి చెందిన ఎడ్దూర్‌ ప్రవీణ్‌కుమార్‌ దిలావర్‌పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనను విధులకు తీసుకొచ్చి తీసుకెళ్లే తండ్రి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఓటు వేయాలనే సంకల్పంతో ప్రవీణ్‌కుమార్‌ చెల్లెలు సహాయంతో మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. చూపులేకపోయినా తన చెల్లెలు సాయంతో వచ్చి ఓటేసిన ప్రవీణ్‌కుమార్‌ను పలువురు అభినందించారు.

పోలీసుల పనితీరు భేష్‌ : ఎస్పీ

నిర్మల్‌టౌన్‌: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది పనితీరు అభినందనీయమని ఎస్పీ జానకీ షర్మిల పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పలు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, అవినాశ్‌కుమార్‌, రాజేశ్‌మీనా, ఇన్‌స్పెక్టర్లు ప్రేమ్‌కుమార్‌, మల్లేశ్‌, ప్రవీణ్‌కుమార్‌, ఆర్‌ఐ రమేశ్‌, సిబ్బంది ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పోలింగ్‌ ప్రశాంతం1
1/3

పోలింగ్‌ ప్రశాంతం

పోలింగ్‌ ప్రశాంతం2
2/3

పోలింగ్‌ ప్రశాంతం

పోలింగ్‌ ప్రశాంతం3
3/3

పోలింగ్‌ ప్రశాంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement