సాగునీటి సమస్య తలెత్తొద్దు
● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ● జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
నిర్మల్‌ఖిల్లా: యాసంగిలో పంటలకు సాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని సచివాలయం నుంచి యాసంగి పంటల సాగు, సాగునీటి వసతి, వసతి గృహాల తనిఖీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలపై సోమవారం సాయంత్రం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. యాసంగిలో సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్ష చేసి ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాల వారీగా సాగు చేస్తున్న పంటల విస్తీర్ణానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ వసతి గృహాలను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామ, మండలస్థాయి కార్యాలయాలలో మొదలుకొని, జిల్లాస్థాయి కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. యాసంగి పంటలకు సాగు నీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బోరు బావుల ఆధారిత పంటలకు ఇబ్బంది కలుగకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 57 ప్రభుత్వ వసతి గృహాల్లో ఇప్పటికే అదనపు కలెక్టర్‌తో కలిసి తనిఖీ చేసినట్లు వెల్లడించారు. గుర్తించిన సమస్యలను పరిష్కరించామన్నారు. వసతి గృహాలకు ప్రత్యేక అధికారులను నియమించి వారానికి రెండుసార్లు విద్యార్థులతో కలిసి భోజనం చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. బాలశక్తి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపట్టామన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేసవిలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 6305646600 ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఇరిగేషన్ ఎస్‌ఈ రవీందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment