నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయిల్‌పామ్ విస్తీర్ణ పథకంలో భాగంగా జిల్లాలో మూడేళ్లుగా ఆయిల్‌పామ్ సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఆయిల్‌పామ్ రైతులను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. 2022–23లో 1,322 రైతులు 3,567 ఎకరాల్లో, 2023–24 లో 1,548 మంది రైతులు 3,498 ఏకరాల్లో, 2024–25లో 423 రైతులు 1,073 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేశారని వివరించారు. పంట వేసిన 36 నెలల తర్వాత గెలలు కోతకు వస్తాయని తెలిపారు. జూన్ నాటికి దాదాపు 3,500 ఎకరాల ఆయిల్‌పామ్ దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. మొదటి ఏడాది ఎకరాకు సరాసరి 2 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాకు అధికారికంగా ప్రీ యూనిక్ కంపెనీ ద్వారా ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. పరిశ్రమ ఏర్పాటు ఆలస్యమైనా ఆయిల్ పామ్ పంటలోని ప్రతీ గెలను ప్రీ యూనిక్ కంపెనీ కొంటుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాలను జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మండలాల వారీగా ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ప్రీ యూనిక్ పరిశ్రమ పనులు సైతం వేగవంతం చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment