
నిఘా నీడన ఇంటర్ మూల్యాంకనం
● ఈనెల 10న ప్రారంభమైన ప్రక్రియ ● 22 నుంచి మొదటి స్పెల్ ప్రారంభం ● ఏప్రిల్ 10 వరకు పూర్తయ్యేలా ప్రణాళిక
లక్ష్మణచాంద: ఇంటర్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం వడివడిగా సాగుతోంది. ఈనెల 10న జిల్లా ఇంటర్ అధికారులు మూల్యాంకనం ప్రక్రియను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలో మొత్తం నాలుగు విడతల్లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 10న ప్రారంభమైన ప్రక్రియలో భాగంగా మొదట సంస్కృతం పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియకు మొత్తం 04 ఏఈలుగా నియమించారు. ఈనెల 22వ తేదీ నుంచి మొదటి విడత ప్రారంభమైంది. ఇందులో తెలుగు, ఆంగ్లం, గణితం, పొలిటికల్ సైన్స్ పేపర్లు మూల్యాంకనం చేయడానికి ఎగ్జామినర్లు ఈనెల 21వ తేదీన రిపోర్ట్ చేశారు. రెండో విడత మూల్యాంకనం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లు మూల్యాంకనం చేయడానికి ఎగ్జామినర్లు ఈనెల 23న రిపోర్ట్ చేశారు. ఇక మూడో విడత మూల్యాంకనం ప్రక్రియ ఈనెల 26న ప్రారంభం కానుంది. ఇందులో రసాయనశాస్త్రం, కామర్స్ పేపర్లు మూల్యాంకనం చేయడానికి ఎగ్జామినర్లు ఈనెల 25న రిపోర్ట్ చేయనున్నారు. నాలుగో విడత మూల్యాంకనం ఈనెల 28న ప్రారంభమవుతుంది. ఇందులో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, చరిత్రకు సంబంధించిన ఎగ్జామినర్లు ఈనెల 27న రిపోర్ట్ చేయనున్నారు.
సీసీ కెమెరాల మధ్యన మూల్యాంకనం...
గతంకు భిన్నంగా ఈసారి ఇంటర్ బోర్డు మొదటి నుంచి అన్నింటిని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మొదట ఇంటర్ రెండవ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలను సీసీ కెమెరాలు మధ్యన నిర్వహించిన ఇంటర్ బోర్డు అధికారులు అనంతరం ఇంటర్ వార్షిక పరీక్షలు కూడా సీసీ కెమెరాల మధ్యన విజయవంతంగా నిర్వహించారు. ఇంటర్ వార్షిక పరీక్షలు నేటితో ముగియడంతో ఇంటర్ మూల్యాంకనం కూడా సీసీ కెమెరాలు మధ్యన నిర్వహిస్తున్నారు. ఎగ్జామినర్లు మూల్యాంకనం కేంద్రానికి వచ్చి పేపర్లు తీసుకున్నది మొదలు మూల్యాంకనం పూర్తి చేసి తిరిగి చీఫ్ ఎగ్జామినర్లకు(సీఈలకు) పేపర్లు అందజేసే వరకు మొత్తం సీసీ కెమెరాలు పర్యవేక్షణలో జరుగుతుంది.
బయోమెట్రిక్ హాజరు..
ఇంటర్ మూల్యాంకనానికి హాజరయ్యే ఎగ్జామినర్లకు ఈసారి బయోమెట్రిక్ హాజరు ప్రవేశపెట్టారు. మూల్యాంకనానికి వచ్చే అధ్యాపకులు రోజు ఉదయం 10:30 గంటల లోపే బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.10:30 తర్వాత వచ్చే ఎగ్జామినర్లకు ఈసారి అనుమతి ఉండదని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
రోజుకు 30 పేపర్లు...
జిల్లాకు మొత్తం 1,37,000 జవాబు పత్రాలు వచ్చాయని ఇంటర్ నోడల్ అధికారి పరశురామ్‌నాయక్ తెలిపారు. జిల్లాలోని మూల్యాంకనానికి 500 మంది ఏఈలు పాల్గొంటారని పేర్కొన్నారు. మూల్యాంకనానికి హాజరవుతున్న ఎగ్జామినర్లకు ఒక రోజుకు 30 పేపర్ల చొప్పున ఇస్తారు. ఇందులో ఉదయం 15 పేపర్లు మధ్యాహ్నం 15 పేపర్ల చొప్పున ఇస్తారు.