
గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలి
సారంగపూర్: గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ సూచించారు. మండలంలోని ఆలూరు గ్రామంలో లెప్రసీ డిటెక్షన్ సర్వేను శుక్రవారం తనిఖీ చేశారు. తెల్లగా పాలిపోయిన స్పర్శ లేని మచ్చలు ఉంటే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. లెప్రసీకి వైద్యం ఉందని, దిగులు పడొద్దని సూచించారు. నిత్యం గ్రామాలకు వచ్చే వైద్యసిబ్బంది మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులపై పరీక్షలు నిర్వహించి రిపోర్ట్ చేయాలని సూచించారు. అనంతరం రిజిష్టర్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జిల్లా మాస్ మీడియా అధికారి రవీందర్, మహిళా ఆరోగ్య సహాయకురాలు నుస్రత్, ఆశ కార్యకర్తలు ఉన్నారు.