
ఇద్దరు మట్కా నిర్వాహకుల అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): జైనథ్ మండలంలోని పూసాయి గ్రామ శివారులో మంగళవారం మట్కా నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ సాయినాథ్ తెలిపారు. మంగళవారం జైనథ్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై పురుషోత్తం, ఏఎస్సై సిరాజ్ ఖాన్, కానిస్టేబుళ్లు శివాజీ, స్వామి దాడులు నిర్వహించి ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని పొచ్చర గ్రామానికి చెందిన కడదారపు గంగన్న, తాంసి మండలంలోని హస్నాపూర్‌కు చెందిన రాకేందర్‌ల నుంచి రూ.4,100 నగదుతో పాటు సెల్‌ఫోన్, మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మహారాష్ట్రలోని బోరికి చెందిన గజ్జుకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు వివరించారు. జైనథ్ మండలంలో మట్కా, పేకాట, దేశీదారు వంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే 8712659916, 8712659929 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.