సిమెంట్ సైలో పైకి ఎక్కిన రాములు
మోపాల్: మంచిప్ప రిజర్వాయర్ సర్జిఫుల్ వద్ద పరికరాలు, సామగ్రి, కంపెనీ కార్యాలయం కోసం వినియోగించుకుంటున్న భూమి ఇచ్చేయాలని బాధిత రైతులు శనివారం ఆందోళన చేట్టారు. ప్రాజెక్ట్ పనులు చేపడుతున్న కంపెనీ రైతులతో 2016లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కౌలు చెల్లిస్తూ వస్తోంది. ఆ ఒప్పందం గత నెలతో ముగిసింది. తిరిగి ఒప్పందం చేసుకుందామంటే రైతులు ముందుకు రావడంలేదు. భూమి ఇచ్చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈక్రమంలో రైతులు కంపెనీకి నోటీసు అందజేశారు. అప్పటి నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. రైతుల డిమాండ్ మేరకు రెండెకరాలను ఇచ్చేస్తామని చెప్పారు. మరో రెండెకరాలకు ఆరు నెలల గడువు ఇవ్వాలని కోరారు.
ఉద్రిక్త పరిస్థితులు
మంచిప్పలోని చింతకుంట రాములు, గూండ్ల సాయిలు, నరేందర్, యమున అనే రైతులు 2016, 2018 సంవత్సరంలో నాలుగెకరాల భూమిని పనుల కోసం ఒప్పందం మేరకు కౌలు (పరిహారం)పై ఇచ్చారు. ఒప్పందం చేసుకున్న రైతుల్లో ఇద్దరు మృతి చెందారు. రెండేళ్లుగా మంచిప్ప రిజర్వాయర్ పనులను నిర్వాసితుల కమిటీ అడుగడుగునా అడ్డుకుంటోంది. దీంతో పనులు నిలిచిపోయాయి. ఒప్పందం ప్రకారం కౌలు చెల్లిస్తున్నారు.
తాజాగా ఒప్పందం ముగియడంతో మా భూమి మాకు కావాలని పట్టుబట్టారు. శనివారం బాధిత రైతులు కు టుంబసభ్యులు, గ్రామస్తులతో అక్కడికి చేరుకుని చనిపోయిన రైతులు ఫొటోలతో ఆందోళన, ధర్నా చేపట్టారు. చింతకుంట రాములు బ్యాచింగ్ ప్లాంట్ వద్ద సిమెంట్ సైలో ఎక్కి నిరసన తెలియజేశారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అధికారుల సమక్షంలో చర్చలు
భూమి ఇచ్చేయాలని బాధిత రైతులతో ఆందోళనకు దిగగా, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించి చర్చలు జరిపారు. రాములు మినహా మిగతా వారి భూమి ఇచ్చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కానీ రాములుకు చెందిన 2.02 ఎకరాల భూమిని ఆరు నెలల తర్వాత ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏడాదికి రూ.1.30లక్షలు కౌలు చెల్లిస్తుండగా, అది పెంచి రూ.1.70 లక్షలు చెల్లించి ఒప్పందం గడువు పెంచుకుందామని ఆఫర్ ఇవ్వగా, ఆయన ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో ముంపు నిర్వాసితుల కమిటీ, రైతులు, కంపెనీ ప్రతినిధులు, ప్రాజెక్ట్ అధికారులు,
పోలీసుల సమక్షంలో చర్చలు జరిగాయి. సుమారు రెండు గంటలకుపైగా జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. మా భూమి మాకు కావాలని రైతులు చెప్పి వెళ్లిపోయారు. చర్చల్లో ప్రాజెక్ట్ డీఈ బాల్‌రాజ్, నవయుగ కంపెనీ ఏజీఎం కాశీ గోవింద్‌రావు, ఏఎస్సై రమేష్, ఉపసర్పంచ్ జగదీష్, ముంపు కమిటీ ప్రతినిధులు రాజేష్, భాస్కర్, బాధిత రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment