గొర్రెలు నచ్చలే..! - | Sakshi
Sakshi News home page

గొర్రెలు నచ్చలే..!

Published Wed, Jun 21 2023 12:48 AM | Last Updated on Wed, Jun 21 2023 9:35 AM

అనంతపూర్‌ నుంచి ఇటీవల జిల్లాకు ఇటీవల తీసుకువచ్చిన జీవాలు - Sakshi

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): గొర్రెల కోసం ఏపీలోని అనంతపూర్‌కు వెళ్లిన జిల్లా అధికారులకు, లబ్ధిదారులకు చుక్కెదురైంది. అక్కడ మందలు మందకొడిగానే ఉండడంతో లబ్ధిదారులకు జీవాలు నచ్చలేదు. దీంతో బోధన్‌ నుంచి 18 మంది, పల్లికొండ నుంచి 16మంది మూడ్రోజుల పాటు అక్కడే ఉండి జిల్లాకు వాపస్‌ వచ్చారు. అనుకున్న స్థాయిలో గొర్రెలు లేకపోవడం, కొన్నిచోట్ల పెద్దగా ఉండడంతో కొనుగోలు సాధ్యపడలేదు. దీంతో జిల్లాలో జీవాల పంపిణీకి స్వల్ప బ్రేకులు పడ్డాయి. లబ్ధిదారులను మళ్లీ తీసుకెళ్లడానికి పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇందుకోసం మందలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల కోసం అన్వేషిస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 9న గొర్రెల పంపిణీని ప్రారంభించారు. అయితే, ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న జీవాల పంపిణీ జిల్లాలో 85 యూనిట్లకే పరిమితమైంది. ఇటీవల అనంతపూర్‌ జిల్లాకు వెళ్లిన అధికారులు ఆపసోపాలు పడి ఇప్పటి వరకు జిల్లాకు 1,785 జీవాలను మాత్రమే తెచ్చారు. వాస్తవానికి పంపిణీ ప్రారంభం రోజున 24 యూనిట్ల చొప్పున ఐదు నియోజకవర్గాలు కలిపి మొత్తం 120 యూనిట్లను లబ్ధిదారులకు అందజేయాలి.

కానీ, జీవాలను పక్క రాష్ట్రం నుంచి తెచ్చేందుకు సమయం సరిపోకపోవడంతో 85 యూనిట్లే పంపిణీ చేశారు. ఇంకా 35 యూనిట్లు గ్రౌండింగ్‌ చేయాల్సి ఉంది. దీనికోసం ఇటీవల అనంతపూర్‌కు వెళ్లగా, అక్కడి గొర్రెలు లబ్ధిదారులకు నచ్చలేదు. దీంతో మిగిలిన యూనిట్ల గ్రౌండింగ్‌ దశాబ్ది ఉత్సవాల్లో సాధ్యపడలేదు.

డీడీలు కట్టిన వారిని తీసుకెళ్తాం
గొర్రెలు నచ్చక అనంతపూర్‌ నుంచి కొంతమంది వాపస్‌ వచ్చిన విషయం వాస్తవమే. వారిని మళ్లీ తీసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 120లో ఇంకా 35 యూనిట్లు గ్రౌండింగ్‌ చేయాల్సి ఉంది. డీడీలు కట్టిన మిగతా వారందరినీ కూడా జీవాలను తెచ్చేకునేందుకు తీసుకెళ్తాం. లబ్ధిదారులు అందోళన చెందకుండా ఒపిక పట్టాలి.
– జగన్నాథచారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

మిగతా వారికి ఎప్పుడో?
రెండో విడత గొర్రెల పంపిణికీ ప్రభుత్వం జిల్లాకు 8,384 యూనిట్ల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇప్పటి వరకు 1,843 మంది గొల్ల, కుర్మలు తమ వాటాధనాన్ని ప్రభుత్వానికి డీడీల రూపంలో చెల్లించారు. ప్రస్తుతం 85 మందికి మాత్రమే యూనిట్లు అందడంతో మిగతా వారు మాకెప్పుడిస్తారని అధికారులను అడుగుతున్నారు. తమను కూడా జీవాలను తెచ్చుకునేందుకు తీసుకెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే, గొర్రెలను జిల్లాకు తేవడానికి కలెక్టర్‌ నియమించిన జిల్లా అధికారులు ఇటీవల అనంతపూర్‌కి వెళ్లారు. మళ్లీ తెచ్చేందుకు వారినే పంపుతారా? లేదా రాష్ట్ర శాఖ సూచించిన అధికారులు వెళ్లారా..? అనే స్పష్టత రావాల్సి ఉంది. అనంతపూర్‌తో పాటు కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా నుంచి జీవాలను తెచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, రాయచూర్‌కు ఇంత వరకు జిల్లా నుంచి వెళ్లలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement