సుభాష్‌నగర్ : ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల త్యాగాలు స్మరించు కోవడానికే సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్‌లో అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, అధికారులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం త్యాగం చేసిన వారి కుటుంబాలను గౌరవించుకోవడం కోసమే కార్యక్రమం చేపట్టామన్నారు. ఉద్యమంలో జిల్లాలో 32 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, వారి కు టుంబానికి రూ.10 లక్షల చొప్పున నగదు అందించామని, 30 మందికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించా మన్నారు. మరో రెండు కుటుంబాలకు కూడా ఉ ద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 21 రోజుల పా టు గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అండగా సీఎం కేసీఆర్
ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటున్నారని జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు అన్నారు. 2001 నుంచి కేసీఆర్‌తో అడుగులో అడుగు వేసి ఉద్యమంలో పాల్గొన్నామన్నారు. అన్ని వర్గాల ప్రజల సహకారంతో తెలంగాణ సాధించి 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు.
అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ
అమరుల త్యాగంతోనే తెలంగాణ ఏర్పడిందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరంలో 8 మంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారని గుర్తుచేశారు. వారి లోటు మరువలేనిదని, బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల నగదు అందజేసి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామన్నారు. మేయర్ నీతూకిరణ్ మాట్లాడుతూ అమరవీరులను స్మరించుకోవడం, వారి కుటుంబాలను సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాల నాయకులను విస్మరించడం సరికాదని, కార్యక్రమ సమాచారం, ఆహ్వానం అందలేదని టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ పేర్కొన్నారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment