మంజీర పరీవాహకంలో విచ్చల విడిగా ఇసుక రవాణా.. ప్రభుత్వ ఆదాయానికి గండి
పరిమితికి మించి టిప్పర్ల ద్వారా తరలింపు
భారీగా దెబ్బతింటున్న రోడ్లు
స్థానిక అభివృద్ధి పనుల కోసం అనుమతులిస్తే ఇతర జిల్లాలకు ఇసుక తోలకాలు
రవాణా శాఖ చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తేనే అడ్డుకట్ట
మంజీర పరీవాహకంలో ఇసుక తవ్వకాలు నిబంధనలు అతిక్రమించి సాగుతున్నా యి. ఒక్కో టిప్పర్‌లో 15 టన్నుల ఇసుక లోడ్ వేయాల్సి ఉండగా, ఏకంగా 21 ట న్నులు లోడ్ వేసుకుని వెళ్తున్నారు. టిప్పర్లకు ముందు ఎస్కార్ట్ మాదిరిగా ఓ కారు వెళుతుంది. ఎక్కడైనా అధికారుల తనిఖీలు ఉంటే కారులో వెళ్లే వారు టిప్పర్ డ్రైవర్లకు సమాచారమిస్తారు. ఇసుక ర్యాంప్‌ల వద్ద దుమ్ము కారణంగా పంటలు పాడైపోతున్నాయి.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : బోధన్ డివిజన్ మంజీర పరీవాహకంలోని ఇసుక తవ్వకాలలో పరిమితులు అతిక్రమించి, నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారు. బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి, బోధన్, రెంజల్ మండలాల్లో అభివృద్ధి పనుల కోసం అవసరమైన ఇసుక తరలించేందుకు ప్రభుత్వం బోధన్‌లోని ఖండ్‌గావ్, సిద్ధాపూర్ గ్రామాల వద్ద మంజీర నదిలో ఇసుక తవ్వేందుకు అనుమతులు ఇచ్చింది. వివిధ రకాల ప్రభుత్వ అభివృద్ధి పనులతోపాటు ఈ మండలాల్లోని ప్రైవేటు పనులకు సైతం ఇక్కడి నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు రెవెన్యూ శాఖ వెసులుబాటు కల్పించింది. అయితే ఇసుక తోలకందార్లు అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఓవర్ లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం ఒక్కో టిప్పర్‌కు 15 టన్నులు (10 క్యూబిక్‌మీటర్లు) లోడ్ వేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఏకంగా 21 టన్నులు (14 క్యూబిక్ మీటర్లు) లోడ్ వేసుకుని టిప్పర్లు వెళుతున్నాయి. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్ల బాడీని ఎత్తుకు కట్టి స్తున్నారు. వీటిని తొలగించాల్సిన బాధ్యత రవాణా శాఖ అధికారులదే. రవాణా అధికారులు పట్టించుకోకపోవడంతో టిప్పర్లలో ఓవర్ లోడ్ భారీగా వేసి ఇసుక రవాణా చేస్తున్నారు. ఇలా వెళ్లే వాటిలో 10 టిప్పర్లకు ఒక కారు చొప్పున ముందుగా వెళుతుంది. తనిఖీ అధికారులు ఉంటే ఫోన్ ద్వారా టిప్పర్ డ్రైవర్లకు సమాచారమిస్తారు. లేకుంటే ఎస్కార్ట్ మాదిరిగా సాఫీగా వెళుతున్నారు.
బోధన్ నియోజకవర్గంలోని పనులు, అవసరాల కోసం కేటాయించిన ఖండ్‌గావ్ ఇసుక పాయింట్ నుంచి ఇసుకను నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ లాంటి ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఓవర్ లోడ్ వేసుకుని మరీ రవాణా చేస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మరోవైపు ఈ భారీ లోడ్ టిప్పర్ల కారణంగా రోడ్లు బాగా దెబ్బతింటున్నాయి. రోడ్డు ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. అదేవిధంగా ఇసుక ర్యాంప్ నిర్వహిస్తున్న మంజీర పరీవాహకంలో దుమ్ము కారణంగా పంటలు సైతం పాడైపోతున్నాయి.
ఖండ్‌గావ్ గ్రామం వద్దే రవాణా శాఖ చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తే ఇసుక ఓవర్ లోడ్ వ్యవహారాన్ని అరికట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండానూ చూడవచ్చు. ఈ విషయమై బోధన్ తహసీల్దార్ విఠల్‌ను వివరణ కోరగా స్థానికంగా మూడు మండలాల్లో అవసరాల నిమిత్తమే ఈ ఇసుక ర్యాంప్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. టిప్పర్‌కు 10 క్యూ బిక్ మీటర్లు, ట్రాక్టర్‌కు 3 క్యూబిక్ మీటర్లకు మాత్ర మే లోడ్ చేసేందుకు అనుమతి ఉందన్నా రు. ఓవర్ లోడ్, ఇ తర ప్రాంతాలకు ఇసుక రవాణా వి షయమై రవాణా శాఖ వారు దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment