రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
అధికారులు, వ్యాపారులతో సమీక్షలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
నిజామాబాద్‌అర్బన్: ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పంట విక్రయాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్‌లో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్‌తో కలిసి వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులు, ట్రేడర్లు, విత్తన వ్యాపారులతో గురువారం సమావేశం నిర్వహించారు.
ప్రస్తుత సీజన్‌లో సాగైన పంటల విస్తీర్ణం, దిగుబడులు, మార్కెట్‌లో డిమాండ్, పంటలకు లభిస్తున్న ధరలు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. బైబ్యాక్ ఒప్పందానికి కట్టుబడి తెల్లజొన్న, ఎర్రజొన్న కొనుగోళ్లు జరగాలని, రైతులు బయట మార్కెట్లో ఎక్కువ ధరకు పంట అమ్ముకోవాలని భావిస్తే వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సీడ్ వ్యాపారులకు సూచించారు. మార్చి 15 వరకు మార్కెట్‌కు జొన్న, పసుపు పంట దిగుబడులు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఇబ్బందులకు తావులేకుండా సాఫీగా క్రయవిక్రయాలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
డైరెక్ట్ పర్చేస్ సెంటర్ల ద్వారా రైతులు పసుపు విక్రయించడంతోపాటు వేగవంతంగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులను మోసగిస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగవ్వ, ఏడీఏలు, ఏవోలు, పసుపు ట్రేడర్లు, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment