
కొత్త కోర్సులుంటేనే అనుమతి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో గత నాలుగు సంవత్సరాల డిగ్రీ ప్రవేశాల వివరాలు
డిగ్రీలో సమూల మార్పులు?
● ప్రాజెక్టు వర్క్ ఉండేలా కొత్త సిలబస్
● ఈ ఏడాది పలు కళాశాలలకు అనుమతి కష్టమే..
● కనుమరుగు కానున్న దోస్త్..!
విద్యా అందుబాటులో డిగ్రీలో చేరిన మిగిలిన
సంవత్సరం సీట్లు విద్యార్థులు సీట్లు
2021–22 34,370 17,960 16,410
2022–23 26,980 14,564 12,416
2023–24 33,630 14,046 19,584
2024–25 33,830 12,764 21,764
తెయూ(డిచ్‌పల్లి): డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఈ ఏడాది సమగ్రంగా మారబోతోంది. ‘డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్)’ తెరమరుగు కానుంది. దాని స్థానంలో పాత పద్ధతిలోనే కాలేజీలు సొంతంగా అడ్మిషన్లు చేపట్టబోతున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే డిగ్రీ ప్రవేశాల విధి విధానాలను ఖరారు చేయనున్నారు. అయితే కోర్సుల ఏర్పాటు, అనుమతులు విద్యామండలి అధీనంలోనే ఉంటాయని, ఏయే కోర్సులకు, ఏయే కాలేజీలకు అనుమతించాలనేది మండలి నిర్ణయిస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో సుమారు 15 డిగ్రీ కాలేజీలకు అనుమతి రద్దయ్యే అవకాశాలున్నాయి. కొత్త విధి విధానాలు వచ్చిన తర్వాత అందుకు తగిన విధంగా కోర్సులు ఉంటే తప్ప కాలేజీలకు అనుమతి లభించడం కష్టమని అధికారులు పేర్కొంటున్నారు.
డిగ్రీ సీట్లకు కోత
తెయూ పరిధిలో ప్రస్తుతం 74 డిగ్రీ కాలేజీలు ఉన్నా యి. అందులో 13 ప్రభుత్వ, 54 ప్రైవేటు, ఎయిడె డ్, రెసిడెన్షియల్ (గురుకులాలు) డిగ్రీ కాలేజీల్లో కలిపి సుమారు 34,500 సీట్లు ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా డిగ్రీ ప్రవేశాలు 40 నుంచి 50 శాతానికి మించడం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 30 శాతం మాత్రమే సీట్లు భర్తీ అవుతున్నాయి. గ్రా మీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో అయితే ఇది 25 శాత మే. నిజానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంట ర్ ఉత్తీర్ణత సాధించిన వారంతా డిగ్రీలో చేరినా ఇంకా సీట్లు మిగిలిపోయే పరిస్థితి. ఇలా విద్యార్థులు తక్కువ, సీట్లు ఎక్కువ ఉండటంపై ఉన్నత విద్యా మండలి ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని డిగ్రీకాలేజీల్లో భర్తీ అవుతున్న సీట్లలో సగానికిపైగా సీట్లు కొత్త కోర్సులకు సంబంధించినవే ఉంటున్నాయి. బీకాం ఫైనాన్స్, కంప్యూటర్స్ వంటి కాంబినేషన్ సబ్జెక్టులకు డిమాండ్ ఉంది. ఆ తర్వాత స్థానంలో బీఎస్సీ కంప్యూటర్స్, లైఫ్‌సైన్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నారు. కానీ ఈ కోర్సులు అన్ని కాలేజీలలో లేవు. అధిక సంఖ్యలోని కాలేజీల్లో ఇప్పటికీ సాధారణ డిగ్రీ కోర్సులే ఉన్నాయి. కాంబినేషన్ కోర్సులు ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లోనే ఉంటున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని యూజీసీ, ఉన్నత విద్యా మండలి డిజైన్ చేసిన కోర్సులను అందుబాటులోకి తెచ్చిన కాలేజీలకే అనుమతివ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో తెయూ పరిధిలో సైతం దాదాపు 16 వేల సీట్లు తగ్గిపోయే అవకాశాలున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.
కొత్త సిలబస్ అందుబాటులోకి..
ఉన్నత విద్యామండలి 2025–26 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణ డిగ్రీలో కంప్యూటర్ కోర్సులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి సబ్జెక్టులను అందుబాటులోకి తేనుంది. ఈ దిశగా నిపుణులు సిలబస్‌ను రూపొందించారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను కాలేజీలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ కోర్సులను బోధించేందుకు నిపుణులైన అధ్యాపకులు అవసరం. కొత్త సిలబస్‌లో తరగతి గదిలో బోధనతో సమానంగా నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు వర్క్ ప్రవేశపెడుతున్నారు. ఏఐ కోర్సు తీసుకునే విద్యార్థులు ఏదైనా ప్రముఖ కంపెనీ తోడ్పాటుతో సొంతంగా సరికొత్త ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. రెండో ఏడాది మినీ ప్రాజెక్టు, మూడో ఏడాది పెద్ద ప్రాజెక్టును చేపట్టాలి. దీనికోసం కాలేజీలు కొన్ని సంస్థలతో భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఎంవోయూ ఉన్న కాలేజీలకు మాత్రమే ఈసారి అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి భావిస్తున్నట్టు తెలిసింది. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యేలోగా ఈ మార్పులపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment