
టీచర్ స్థానంలో కమలం పాగా!
● తొలి ప్రాధాన్యత ఓట్లతోనే
గెలిచిన మల్క కొమురయ్య
● కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓటర్ల
విభజన
సాక్షిప్రతినిధి,కరీంనగర్: నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ నియోజవర్గం కమలం వశమైంది. తొలిప్రాధాన్యం ఓట్లతోనే మల్క కొమురయ్య టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించారు.
నల్గొండ టీచర్ ఎన్నికల ఫలితాలు సాయంత్రానికే వచ్చేసినా.. కరీంనగర్ టీచర్ ఎన్నికల లెక్కింపు సాయంత్రానికి మొదలవడం గమనార్హం. కౌంటింగ్ ప్రారంభించిన రెండు గంటల్లోనే ఫలితం తేలింది. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోల్ అవగా.. అందులో 24,144 చెల్లుబాటు అయ్యాయి. 897 ఓట్లు చెల్లలేదు. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి.
బండి అభినందనలు
రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చారిత్రక విజయమని, ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని అన్నారు.
ఉదయం 8 నుంచి..
సోమవారం ఉదయం నుంచి గ్రాడ్యుయేట్ ఓట్ల వడపోత కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టిన ఎన్నికల లెక్కింపు, చెల్లని, చెల్లిన ఓట్ల విభజనపై రాత్రి 9గంటలు దాటేవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అప్పటి వరకూ దాదాపు లక్ష ఓట్లను వడబోయగా అందులో 92,000 చెల్లుబాటు అయ్యాయని, 8,000 ఓట్లు చెల్లలేదని, మిగిలిన 1.5 లక్షల ఓట్ల వడబోత మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు.
లెక్కింపు ప్ర క్రియ మందకొడిగా సాగడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలైన ఓట్లలో కొందరు 01, 02 అని వేసిన వారి ఓట్లు పరిగణనలోకి తీసుకోవాలని పట్టభద్రుల స్థానానికి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment