
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠను కలిగిస్తోంది. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఆలస్యంగా అయినా ఫలితం తేలింది.
ఇక కీలకమైన పట్టభద్రుల ఓట్ల లెక్కింపు మాత్రం యంత్రాంగానికి పెద్ద టాస్క్ అవుతోంది. ఇదిలా ఉండగా ఉపాధ్యాయులు, పట్టభద్రులకు సంబంధించి చెల్లని ఓట్ల సంఖ్య భారీగా ఉండడం గమనార్హం. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఓట్లు మొత్తం 3,55,159 ఉన్నాయి. ఇందులో 2.50 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి.
లెక్కింపు మొదలుపెట్టిన రోజైన సోమవారం రాత్రికి 1 లక్ష ఓట్లను చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లుగా విభజన చేశారు. ఇంకా 1.5 లక్షల పోలైన ఓట్లను చెల్లిన, చెల్లని ఓట్లుగా విభజన చేయాల్సి ఉంది. ఇప్పటివరకు విభజన చేసిన 1 లక్ష ఓట్లలో 8 వేలకు పైగా చెల్లని ఓట్లు ఉండడం గమనార్హం. మిగిలిన 1.5 లక్షల ఓట్లలో చెల్లని ఓట్ల సంఖ్య భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 42 శాసనసభ సెగ్మెంట్ల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులు, వాటిలోని బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కట్టడం, విభజన చేసేందుకే చాలా సమయం తీసుకుంటోంది. పైగా అభ్యర్థుల సంఖ్య భారీగా ఉంది. మొత్తం 56 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో జంబో బ్యాలెట్ పేపర్ తప్పనిసరి అయింది. పైగా ఓట్లు ప్రాధాన్యత క్రమంలో వేసే పరిస్థితి నేపథ్యంలో ప్రతి బ్యాలెట్ పేపర్‌ను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. పైగా ప్రాధాన్యత ఓట్లు వేసే క్రమంలో సింగిల్ డిజిట్‌లో, అభ్యర్థి పేరు పక్కన ఉన్న బాక్సులో మాత్రమే అంకెలు వేయాలి. ఎంతమందికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ మధ్యలో ఏదేని అంకె వేయని పక్షంలో సదరు ఓటు చెల్లకుండా పోతుంది. టిక్కు మార్కులు, ముద్రలు తదితరాలు వేసినా ఓటు చెల్లదు. ఈ క్రమంలో ప్రతి బ్యాలెట్ పేపర్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ద్వారా తేల్చాలంటే ఎలిమినేషన్ రౌండ్ లెక్కింపు తప్పనిసరి. దీంతో పూర్తి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం మరో రెండు రోజులు పట్టనున్నట్లు తెలుస్తోంది.
మల్క కొమురయ్య గెలుపు సంబురాలు..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం 27,088 ఉండగా ఇందులో 24వేలకు పైగా ఓట్లు నమోదయ్యాయి. సోమవారం రాత్రి ఫలితం తేలింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment