
చెరువు ఆక్రమణపై ఏడాదిన్నరగా ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామం, మండలం, డివిజన్ స్థాయిలను దాటి కలెక్టరేట్ వరకు సామాన్యులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నా రు. అయితే కలెక్టరేట్ వరకు సమస్యలను తీసుకొచ్చినప్పటికీ పరిష్కారం దిశగా ఒక్క అడుగూ ముందుకు పడని అర్జీలే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఇంకెక్కడికి వెళ్లాలో తెలియక బాధితులు ఇదే కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇలా తిరుగుతున్నవారిలో పేదలు, నిరక్షరాస్యుల నుంచి విద్యాధికులు సైతం అధికంగా ఉంటున్నారు. కలెక్టరేట్ నుంచి ఆయా విభాగాలకు ఎండార్స్ చేసిన సమస్యల విషయమై యంత్రాంగం ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని, ఈ అంశాలపై సమీక్ష ఉండకపోవడంతో పరిష్కారానికి నోచుకోవడం లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దిక్కుతోచక కన్నీరు పెడుతున్నారు. ఇక కలెక్టరేట్‌లో ప్రజావాణికి వచ్చే సమస్యల్లో సామాజిక అంశాలైన చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలు, ఇతర ప్రజోపయోగ అర్జీలు అనేకసార్లు వస్తున్నప్పటికీ పట్టింపు లేని పరిస్థితి. ప్రజలకు పాలన మరింత చేరువ చేసి సమస్యలను వేగంగా పరిష్కారించేందుకు చిన్న జిల్లాలు, మండలాలు, గ్రామాలు విభజన చేసినప్పటికీ ఫలితం లేదని సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా సోమవారం ‘సాక్షి’ పరిశీలనలో ప్రజావాణికి వచ్చిన అర్జీల్లో కొన్ని..
డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలలో తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, అక్కడ చదువుతున్న కొందరు విద్యార్థులు తరగతులు జరుగుతున్న సమయంలో గోడ దూకి వచ్చి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు ఆహారం నాణ్యత లేకుండా పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెలవులకు ఇళ్లకు వెళ్లి తిరిగి ఒక్కరోజు ఆలస్యంగా వస్తే రూ.500 జరిమానా పేరిట వసూలు చేస్తున్నారని తెలిపారు. కెమిస్ట్రీ లెక్చరర్ సిలబస్‌ను సక్రమంగా బోధించడం లేదని, పైగా అధికంగా సెలవులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇంకా రెండు చాప్టర్లు బోధించలేదని వివరించారు. దీంతో బోర్డు ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతామనే భయం నెలకొందన్నారు. తమ సమస్యల విషయమై వాటి పరిష్కారం కోసం తమ పక్షాన మాట్లాడిన ఇంగ్లిష్ లెక్చరర్‌ను ప్రిన్సిపల్ బదిలీ చేయించినట్లు ఫిర్యాదులో వివరించారు.
పదేళ్లుగా పింఛన్ కోసం..
నిజామాబాద్‌లోని ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన రొడ్డ మణెమ్మ భర్త 2013లో మరణించాడు. అప్పటినుంచి మణెమ్మ వితంతు పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం ఈమెకు 76 సంవత్సరాలు. వృద్ధాప్య పింఛన్ కోసం కూడా గతంలో దరఖాస్తు చేసుకుంది. అయినా రెండింటిలో ఏ రకమైన పింఛను అందడం లేదు. గత పదేళ్లలో మున్సిపల్, కలెక్టరేట్‌లో చాలాసార్లు దరఖాస్తు చేస్తూనే ఉంది. ఫలితం మాత్రం లేదు. కుటుంబ సభ్యులు రేషన్‌కార్డులో తన పేరు లేకపోవడంతో యాడ్ చేసేందుకు దరఖాస్తు చేసుకోగా సాంకేతిక సమస్యలున్నట్లు అధికారులు తెలిపినట్లు వాపోయింది. తాజాగా మళ్లీ కలెక్టర్‌కు అర్జీ పెట్టుకుంది. ఈసారి కూడా పరిశీలిస్తామని అధికారులు చెప్పడం గమనార్హం.
ఎడపల్లి మండలంలోని మంగళ్‌పహాడ్ సమీపంలోని 70 ఎకరాల రాయకుంట చెరువును కొందరు ఆక్రమించారని రాజు అనే వ్యక్తి మరోసారి తాజాగా ఫిర్యాదు చేశాడు. ఈ చెరువుతోపాటు గొలుసుకట్టు చెరువుగా ఉన్న కొత్తకుంట చెరువును సైతం ఆక్రమించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. గంగపుత్రులకు ఉపాధినిచ్చే ఈ చెరువులను ఆక్రమించిన విషయమై ఏడాదిన్నరగా చాలాసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కబ్జాదారులకు కనీసం నోటీసులు సైతం ఇవ్వలేదని ఫిర్యాదుదారుడు తెలిపాడు. భారీ చెరువు చిన్న కుంట మాదిరిగా చిక్కిపోయిందని వివరించాడు.

చెరువు ఆక్రమణపై ఏడాదిన్నరగా ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment