ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్‌అర్బన్: కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. ఈనెల 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో శుక్రవారం సాయంత్రం సీఎస్ వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లకు, కాపీయింగ్‌కు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లను అనుమతించకూడదని, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్‌లతోపాటు కేంద్రాలను తనిఖీ చేసేందుకు వెళ్లే అధికారులు సైతం ఫోన్‌లు తీసుకెళ్లకూడదని ఆదేశించారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోనికి అనుమతించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు తీసుకురావడం మొదలుకుని, పరీక్షలు ముగిసిన మీదట ఆన్సర్ షీట్లను నిర్ణీత పాయింట్‌కు తరలించేవరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పరీక్షలు ప్రారంభం కావడానికి ముందే కేంద్రాలను సందర్శించి తాగునీటి వసతి, సరిపడా ఫర్నీచర్, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేవా అన్నది పరిశీలించాలని తహసీల్దార్లకు సూచించారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ రవీందర్‌కు సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి, వార్షిక పరీక్షలకు సంబంధించి వారికి ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఐఈవోను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీఐఈవో రవికుమార్, నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
సెల్‌ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ
అనుమతించొద్దు
వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష
పాల్గొన్న జిల్లా అధికార యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment