కొందరికే ‘ఇందిరమ్మ’ సాయం
● మోర్తాడ్ మండలం గాండ్లపేట్‌కు చెందిన దైడి అమ్మాయి, ముద్దం ఎల్లమ్మలకు వ్యవసాయ భూమి లేదు. వీరిద్దరూ వ్యవసాయ పనులతోపాటు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసి జీవిస్తున్నారు. భూమి లేని కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద ఏడాదికి రూ.12వేలను రెండు విడతల్లో అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో అమ్మాయి, ఎల్లమ్మలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి లబ్ధిదారులుగా ఎంపికై నా తొలి విడతలో జమ కావాల్సిన రూ.6వేలు ఖాతాలోకి చేరలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో భరోసా సొమ్ముకు బ్రేక్ పడింది. అమ్మాయి, ఎల్లమ్మల మాదిరిగానే చాలా మంది వ్యవసాయ కూలీలు భరోసా డబ్బుల కోసం కొన్నిరోజులు ఓపిక పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మోర్తాడ్(బాల్కొండ): గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటిరోజు జిల్లావ్యాప్తంగా మండలానికో గ్రామాన్ని పథకానికి ఎంపిక చేసింది. అందులో భాగంగా జిల్లాలోని 31 గ్రామాల్లో 1,675 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.కోటీ 50వేలను విడుదల చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 38,802 మందిని అర్హులుగా గుర్తించారు. వీరి కోసం ఒక్కో విడతలో రూ.23,28,12,000 మంజూరు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,675 మందికే ఆత్మీయ భరోసా సొమ్ము జమ చేయగా ఇంకా 37,127 మందికి రూ.22,27,62,000 నిధులను కేటాయించాల్సి ఉంది. కాగా, మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమలు లేని జిల్లాలకు ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేయడం గమనార్హం.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో నిధుల విడుదలకు కోడ్ అడ్డుకాకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగియగా, ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. దీంతో ఎన్నికల కోడ్ తొలగిపోయేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. కోడ్ ఎత్తివేసిన తర్వాతే ఆత్మీయ భరోసా సొమ్ము జమపై స్పష్టత రానుంది. ఈ విషయమై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏం చెప్పలేమని వెల్లడించారు.
కోడ్ ఎత్తివేసిన తర్వాతే స్పష్టత..
మొదట మండలంలో ఒకే గ్రామానికి
ఆత్మీయ భరోసా నిధులు
ఎన్నికల కోడ్‌తో మిగతా
లబ్ధిదారులకు బ్రేక్
కోడ్ లేని జిల్లాల్లో
అర్హుల ఖాతాల్లో జమ
Comments
Please login to add a commentAdd a comment