గౌరవ వేతనం అందేదెప్పుడు? | - | Sakshi
Sakshi News home page

గౌరవ వేతనం అందేదెప్పుడు?

Published Sun, Mar 2 2025 1:39 AM | Last Updated on Sun, Mar 2 2025 1:37 AM

గౌరవ వేతనం అందేదెప్పుడు?

గౌరవ వేతనం అందేదెప్పుడు?

మోర్తాడ్‌(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఇప్పటికీ గౌరవ వేతనం అందలేదు. సర్వే అనంతరం ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి గౌరవ వేతనం(అలవెన్సులను) అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నెలలు గడుస్తున్నా డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో ఎన్యుమరేటర్లు, పరిశీలన జరిపిన సూపర్‌వైజర్లు, ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసిన ఆపరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిధుల కొరతనే కారణమా?

జిల్లాలో సర్వే నిర్వహించిన వారికి భత్యం చెల్లించడానికి రూ.3,93,20,000లను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా ప్లానింగ్‌ కార్యాలయం ద్వారా సర్వేలో పాల్గొన్న వారికి భత్యం జమ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థుల ఖాతాల నంబర్లను సేకరించి నెలలు గడచినా ఒక్కరికి కూడా నయాపైసా జమ కాలేదు. జిల్లా ప్లానింగ్‌ అధికారులను అభ్యర్థులు వాకబు చేస్తే ట్రెజరీకి బిల్లులు చేసి పంపించామని ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే భత్యం సొమ్ము జమ అవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఆర్థిక శాఖ వద్ద నిధుల కొరత తీవ్రంగా ఉండటంతోనే టోకెన్‌లు జారీ చేసినా భత్యం సొమ్ము జమ కావడానికి సమయం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమైతుంది. ప్రభుత్వం స్పందించి సమగ్ర సర్వేలో పాల్గొన్న సిబ్బందికి డబ్బులు జమ చేయాలని పలువురు కోరుతున్నారు.

ఖాతా నంబర్లు పంపించాం..

సమగ్ర సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన కంప్యూటర్‌ ఆపరేటర్ల బ్యాంకు ఖాతా నంబర్లను చీఫ్‌ ప్లానింగ్‌ కార్యాలయానికి పంపించాం. ఖాతా నంబర్లు పంపించడంతో మా బాధ్యత తీరిపోయింది. అక్కడి నుంచి డబ్బులు జమ కావాల్సి ఉంది. ఇంకా మాకు ఎలాంటి సమాచారం లేదు.

– తిరుమల, ఎంపీడీవో, మోర్తాడ్‌

జిల్లాలో 3500 మంది ఎన్యుమరేటర్లు..

జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, పట్టణాల్లో కుటుంబాల వారీగా వివరాలను నమోదు చేయడానికి 3,500ల మంది ఎన్యుమరేటర్లను నియమించారు. సర్వే ఎలా కొనసాగుతుందో పరిశీలించడానికి 360 మందిని సూపర్‌వైజర్లుగా నియమించారు. ఎన్యుమరేటర్లకు రూ.10వేల చొప్పున, సూపర్‌వైజర్లకు రూ.12వేల అలవెన్సును అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సర్వే నిర్వహించిన ఎన్యుమరేటర్లకే కంప్యూటర్‌ ఆపరేటర్లతో ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయించే బాధ్యత అప్పగించారు. అవుట్‌సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లతోపాటు మీసేవ నిర్వాహకులు, కొందరు విద్యార్థులను ఆన్‌లైన్‌లో వివరాల నమోదు కోసం వినియోగించారు. వీరికి ఒక్కో కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి రూ.50 చొప్పున చెల్లిస్తామని అధికార యంత్రాంగం వెల్లడించింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి రుసుం చెల్లించలేదు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు అలవెన్స్‌లను జమ చేయడానికి ఖాతా నంబర్లను గతంలోనే మండల పరిషత్‌, మున్సిపల్‌ అధికారుల ద్వారా సేకరించారు. భత్యం చెల్లింపులో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకూడదనే ఉద్దేశ్యంతో సర్వేలో పాల్గొన్న వారి ఖాతా నంబర్లను ప్రభుత్వం సేకరించింది.

సమగ్ర సర్వే ముగిసి నెలలు

గడుస్తున్నా విడుదల కాని నిధులు

సిబ్బందికి తప్పని నిరీక్షణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement