సదరం శిబిరాల్లో సదుపాయాలు కల్పించాలి
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
బోధన్: సదరం శిబిరాల్లో వైక్యల నిర్ధారణ కోసం వచ్చే వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సదరం సేవలను సులభతరం చేస్తూ ఇటీవల కొత్తగా యూనిక్ డిజెబిలిటీ ఐడీ (యూడీఐడీ) పోర్టల్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శనివారం సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. బోధన్ సబ్ కలెక్టర్ చాంబర్ నుంచి వీసీలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. సదరం సర్టిఫికెట్ల కోసం ఇక నుంచి యూడీఐడీ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకునేలా చూడాలని సూచించారు. దరఖాస్తుదారులకు సదరం శిబిరానికి ఎప్పుడు హాజరుకావాలనేది ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుందని తెలిపారు. దరఖాస్తు సమయంలో అక్షర దోషాలు, ఇతర తప్పులకు ఆస్కారం లేకుండా మీ సేవ నిర్వాహకులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు ఐదు రకాల కేటగిరీల వారికే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేదని, కొత్తగా రూపొందించిన యూడీఐడీ పోర్టల్‌లో 21 రకాల కేటగిరీలను చేర్చారని కలెక్టర్ వెల్లడించారు. సదరం సర్టిఫికెట్లను స్మార్ట్‌కార్డు రూపంలో పోస్టల్ శాఖ ద్వారా ఇంటికి పంపిస్తారని తెలిపారు. చేయూత పెన్షన్‌తోపాటు ఇతర సంక్షేమ పథకాల కోసం సదరం స్మార్ట్ కార్డు చెల్లుబాటవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీవో సాయాగౌడ్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సదరం శిబిరాల్లో సదుపాయాలు కల్పించాలి
Comments
Please login to add a commentAdd a comment