ఖలీల్‌వాడి: కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండే యువకుడి ప్రాణానికి వెలకట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వివరాలు ఇలా.. నగరంలోని ఆరోటౌన్ పరిధిలోని జ్యూమ్ స్విమ్మింగ్‌పూల్‌లో ఫిబ్రవరి 26న నిజాంకాలనీకి చెందిన సయ్యద్ అశ్రఫ్(22) మృతి చెందాడు. ఈత నేర్చుకునేందుకు అశ్రఫ్ స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లగా.. కోచ్ అందుబాటులో లేకుండానే ఈతకు అనుమతించారు. దీంతో నీట మునిగి అశ్రఫ్ మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, స్విమ్మింగ్ పూల్‌ను తెరిపించుకునేందుకు యాజమాన్యం స్థానికంగా ఉండే ఓ పార్టీ నాయకులను ఆశ్రయించింది. కేసు విత్‌డ్రా చేసుకుంటే నష్టపరిహారం అందిస్తామని నేతలు మృతుడి కుటుంబానికి చెప్పినట్లు సమాచారం. స్విమ్మింగ్‌పూల్ యజమానితో అదే ప్రాంతంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బేరసారాలు మొదలు పెట్టారు. చివరికి నిండు ప్రాణం ఖరీదు రూ.4.50 లక్షలుగా పార్టీ నాయకులు వెలకట్టారు. రాజీలో భాగంగా మృతుడి కుటుంబానికి మొదట రూ. 2లక్షలు, కేసు విత్‌డ్రా సమయంలో మిగితా రూ.2.50లక్షలు చెల్లించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఇదంతా ఎన్నికల కోసమేనా!
కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల సమక్షంలో ఉండేందుకు సదరు పార్టీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవల ఓ భూ వివాదంలో సదరు పార్టీకి చెందిన నేతలు ఓ అధికారితో వాగ్వాదానికి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. పంచాయితీల్లో సదరు పార్టీ నేతలు తలదూర్చుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ నిండు ప్రాణానికి వెలకట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సౌత్ సీఐ సురేశ్ కుమార్‌ను వివరణ కోరగా సయ్యద్ అశ్రఫ్ మృతిపై కేసు నమోదు చేశామని, స్విమ్మింగ్‌పూల్ మూసివేత కోసం కార్పొరేషన్ అధికారులకు లేఖ అందించినట్లు తెలిపారు. అశ్రఫ్ ప్రాణానికి ఖరీదు కట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
గత నెల 26న స్విమ్మింగ్‌పూల్‌లో
పడి యువకుడి మృతి
రాజీ కుదిర్చిన రాజకీయ నేతలు
మొదట రూ.2 లక్షలు..
కేసు విత్‌డ్రా రోజు రూ.2.50 లక్షలు చెల్లించేలా డీల్
Comments
Please login to add a commentAdd a comment