
ఇష్టంతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
డీఈవో అశోక్
మోపాల్(నిజామాబాద్‌రూరల్): విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఉద్బోధించారు. నగర శివారులోని బోర్గాం(పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్ అంటే జిల్లాలో ప్రత్యేక స్థానం ఉంటుందని, 194 మంది విద్యార్థులు పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థులు కష్టపడి ప్రణాళిక ప్రకారం చదివితే మంచి గ్రేడ్ సాధించవచ్చని పేర్కొన్నారు. పాఠ్యాంశాల్లో సందేహాలుంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మోటివేటర్ గంగాప్రసాద్ మాట్లాడుతూ పరీక్షలంటే భయం వీడాలని తెలిపారు. చదివిన అంశాలు ఈజీగా గుర్తు పెట్టుకునేలా సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment