గ్రామీణ ప్రాంతాలపై గంజాయి పడగ
● మత్తులో చిత్తవుతున్న యువత
● రోజురోజుకు విస్తరిస్తున్న విక్రయాలు
● ఆందోళనలో తల్లిదండ్రులు..
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): గ్రామీణ ప్రాంతా ల్లో రోజురోజుకు గంజాయి విక్రయాలు విస్తరిస్తున్నాయి. డిచ్‌పల్లి, ఇందల్వాయి మండలాల్లో యువ త గంజాయికి అలవాటు పడుతూ తమ భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారు. విషయం తల్లిదండ్రులకు తెలిసి మందలించినా మారకపోగా, గంజాయి కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం ఎదిరించే స్థాయికి చేరుకుంటున్నారు. మత్తుకు అలవాటు పడిన తమ పిల్లలను ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొందరు చేసేది లేక తమ పిల్లలను గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు.
ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా..
గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న డిచ్‌పల్లి, ఇందల్వాయి మండలాల్లో గంజాయి విక్రయాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. స్కూల్ పిల్లలతోపాటు కాలేజీ పిల్లలు, యువత బానిసలుగా మారుతున్నారు. గంజాయి అలవాటుతో కొందరు పిల్లలు చదువు మానేసి అల్లరిచిల్లరగా తిరుగుతున్నారు. మత్తుకు బానిసవుతు న్న యువత సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గంజాయి కొనుగోలు చేసేందుకు అవసరమైన డ బ్బుల కోసం చిన్న చిన్న చోరీలకూ పాల్పడుతున్నారు. చైన్ స్నాచింగ్‌లకూ వెనుకాడటం లేదు. దాడుల ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి.
ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం
గంజాయి, మత్తుపదార్థాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్య లు చేపడుతున్నాం. స్పెష ల్ డ్రైవ్ ద్వారా వాహ నాలను తనిఖీ చేస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో రహస్యంగా గంజాయి అమ్మ కాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మండలంలోని మెంట్రాజ్‌పల్లి శివారులో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న గంజాయి ని పట్టుకుని నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించాం. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. అప్పుడే యువత మత్తు పదార్థాల బారిన పడకుండా రక్షించగలుగుతాం. – మల్లేశ్, సీఐ, డిచ్‌పల్లి
ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు, రైలు మార్గం ద్వారా గంజాయిని తీసుకువస్తున్నారు. తర్వాత రహస్య ప్రాంతాల్లోకి తీసుకెళ్లి స్థానిక విక్రేతలకు కిలో రూ.11వేల నుంచి 13వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. స్థానిక వ్యాపారులు వాటిని పొట్లాలుగా మార్చి ఒక్కో పొట్లం రూ.300 నుంచి రూ.500 వరకు యువతకు అమ్ముతున్నారు. ఇందుకోసం మొబైల్ ఫోన్‌లలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిచ్‌పల్లి మండల కేంద్రంతోపాటు నడిపల్లి తండా, బీబీపూర్, ఖిల్లా డిచ్‌పల్లి, ఘన్‌పూర్ గ్రామాల్లో గంజాయి దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. అలాగే ఇందల్వాయి మండల కేంద్రంతోపాటు తిర్మన్‌పల్లి, కొన్ని గిరిజన తండాల్లో గంజాయి విక్రయాలతోపాటు హుక్కా కేంద్రాలు కొనసాగుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
గ్రామీణ ప్రాంతాలపై గంజాయి పడగ
Comments
Please login to add a commentAdd a comment