అడ్డగోలుగా యూరియా విక్రయాలు! | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా యూరియా విక్రయాలు!

Published Wed, Mar 5 2025 1:38 AM | Last Updated on Wed, Mar 5 2025 1:33 AM

అడ్డగోలుగా యూరియా విక్రయాలు!

అడ్డగోలుగా యూరియా విక్రయాలు!

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో ఎరువుల విక్రయా లు అడ్డగోలుగా జరుగుతున్నాయి. పరిమితికి మించి లెక్క లేకుండా యూరియా బస్తాలు ఇవ్వడంతో పలు చోట్ల కొరత ఏర్పడుతోంది. మార్కెట్‌లో నెలకొన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని డీలర్లు, సొసైటీల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎరువుల అమ్మకాలపై వ్యవసాయాధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతో ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యూరియా బస్తాలు పక్క దారి పడుతున్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం యాసంగి సీజన్‌లో ఎన్నడూ లేనంతగా యూరియా విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది యాసంగిలో గరిష్టంగా 74 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అమ్ముడయ్యేది. వ్యవసాయ శాఖ 75 వేల మెట్రిక్‌ టన్నులు అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే 76,840 మె ట్రిక్‌ టన్నులు అమ్ముడు పోయింది. రైతుల నుంచి ఇంకా డిమాండ్‌ రావడంతో వ్యవసాయ శాఖ ఎప్ప టికప్పుడు జిల్లాకు యూరియాను తెప్పిస్తోంది. బాల్కొండ, నందిపేట్‌, డొంకేశ్వర్‌, నవీపేట్‌ లాంటి మండలాల్లో డిమాండ్‌ పెరిగింది. తద్వారా ఈ ప్రాంతాలకు అధికారులు ఎక్కువగా యూరియా నిల్వలను కేటాయిస్తున్నారు. ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ తగ్గడంతో రైతులు ఇటీవల నాట్లు వేశారు. దీంతో ఈ ప్రాంతాల్లో యూరియా అమ్మకాలు పెద్ద మొత్తంలో సాగుతున్నాయి.

పరిమితి లేకుండా పంపిణీ చేస్తున్న డీలర్లు, సొసైటీలు

ఒక్కొక్కరికి 50 బస్తాలకు

మించి ఇస్తున్న వైనం

పర్యవేక్షణ చేయని వ్యవసాయాధికారులు

తద్వారా పలు చోట్ల ఏర్పడుతున్న ఎరువుల కొరత

ధర్పల్లి మండలం గోవింద్‌పల్లిలో ఒక రైతు 55 ఎరువుల బస్తాలు కొనుగోలు చేసినట్లు రికార్డులో నమోదైంది. అలాగే భీమ్‌గల్‌, కంజర, రెంజల్‌, సాలూర, మాక్లూర్‌, పొతంగల్‌, చీమన్‌పల్లి ప్రాంతాల్లో సైతం కొందరు రైతులు ఒక్కొక్కరు 45 బస్తాలకు పైగా తీసుకెళ్లినట్లు లెక్కలున్నాయి. నిజంగా రైతులే కొనుగోలు చేసి తీసుకెళ్లారా? లేదా వారి పేరుతో డీలర్లు, సొసైటీల బాధ్యులు బస్తాలను పక్కదారి పట్టించారా? అనే సందేహం కలుగుతోంది.

పరిమితి లేదు..

యూరియా బస్తాల అమ్మకాలపై పరిమితి పెట్టకపోవడంతో రైతులు అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఒక రైతుకు ఒక సీజన్‌లో యాబైకి మించి బస్తాలు ఇవ్వడానికి అవకాశం లేదు. రైతుకు ఎన్ని బస్తా లు ఇస్తున్నారనేది ఈ–పాస్‌ మిషన్‌లో రికార్డు అవుతుంది. కానీ, ఆ వివరాలను అధికారులు పరిశీలించడం లేదు. డీలర్లు, సొసైటీలు వేరే రైతుల పేరుతో యూరియాను అమ్ముతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. బోధన్‌, బాన్సువాడ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల్లో ఎరువుల కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఎరువులన్ని ఎక్కడిపోతున్నాయో కూడా అధికారులు కనీసం ఆరా తీయడం లేదు. అంతా ‘మామూలు’గా తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఎకరం పొలానికి మూడు బస్తాల యూరియా సరిపోనుండగా కొందరు రైతులు ఎనిమిది బస్తాల వరకు వేస్తున్నారు. దీనిపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించడం లేదు.

అమ్మకాలను పరిశీలిస్తాం

ఈ యాసంగి సీజన్‌లో అంచనాకు మించి యూ రియా అమ్మకాలు జరిగాయి. రైతులు ఎక్కువ బస్తాలను కొనుగోలు చేసి అవసరానికి మించి వరి లో చల్లుతున్నట్లుగా సమాచారం వచ్చింది. లెక్క లేకుండా యూరియా విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం. జిల్లాలో యూరియా కొరత లేదు. 3వేల మెట్రిక్‌ టన్నుల వరకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

– వాజిద్‌ హుస్సేన్‌, జిల్లా వ్యవసాయాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement