తేలని ఫలితం.. వీడని ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

తేలని ఫలితం.. వీడని ఉత్కంఠ

Published Wed, Mar 5 2025 1:37 AM | Last Updated on Wed, Mar 5 2025 1:33 AM

తేలని ఫలితం.. వీడని ఉత్కంఠ

తేలని ఫలితం.. వీడని ఉత్కంఠ

సాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం ఉత్కంఠను రేపుతోంది. మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్‌లో బీజీపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ అభ్యర్థులు పోటాపోటీగా ఓట్లు సాధించారు. ఏ ఒక్క అభ్యర్థి నేరుగా కోటా ఓట్లు చేరుకునే అవకాశాలు కనిపించలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపోటములు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం చెల్లుబాటైన ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎలిమినేషన్‌ ప్రక్రియ ద్వారా ఫలితం తేలనుంది. ట్రయాంగిల్‌గా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

పోటాపోటీ ఓట్లు..

పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీపడినా.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి అల్ఫోర్స్‌ నరేందర్‌ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణ విస్తృత ప్రచా రం చేశారు. దానికి అనుగుణంగానే ఈ ముగ్గురికి పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. 6వ రౌండ్‌ పూర్త య్యే సమయానికి బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ అభ్యర్థులు ముగ్గురు కలిసి సుమారు లక్ష ఓట్లు సాధించగా, బరిలో నిలిచిన 53 మంది అభ్యర్థులందరూ కలిపి కేవలం 10 వేల లోపు ఓట్లు మాత్రమే సాధించారు. దీంతో మూడోస్థానంలో నిలిచే అభ్యర్థి ఎవరనేదానిపై ఎమ్మెల్సీ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రతి రౌండ్‌లో..

మొత్తం 21 టేబుళ్ల ద్వారా 12 రౌండల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొదటి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్‌ అభ్యర్థిపై 36 ఓట్ల మెజార్టీ వచ్చింది. రెండోరౌండ్‌లో 1,457 ఓట్ల మెజార్టీ, మూడోరౌండ్‌లో 3,005 ఓట్లు, నాలుగో రౌండ్‌లో 1,263 ఓట్లు, ఐదోరౌండ్‌లో 1,381 ఓట్ల మెజార్టీ వచ్చింది. 6వ రౌండ్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిపై 211 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తంగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు 45,401 ఓట్లు సాధించి ప్రత్యర్థులపై 6,931 ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. 38,470 ఓట్లతో నరేందర్‌రెడ్డి సెకండ్‌ ప్లేస్‌లో, 31,481 ఓట్లతో ప్రసన్నహరికృష్ణ మూడోస్థానంలో నిలిచారు. మందకొడిగా సాగుతున్న కౌంటింగ్‌ ప్రక్రియకు తోడు పోటాపోటీగా అభ్యర్థులు ఓట్లు సాధిస్తుండటంతో రౌండ్‌ రౌండ్‌కూ ఉత్కంఠ పెరిగింది. రెండోప్రాధాన్యత ఓట్లపైనే బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు.

కౌంటింగ్‌ వివరాలు

పోటీ త్రిముఖం

కోటా ఓట్ల మార్కును

చేరుకోని అభ్యర్థులు

ఎలిమినేషన్‌ ప్రక్రియతోనే

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం

ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి

చిన్నమైల్‌ అంజిరెడ్డి

ఎవరికీ దక్కని విన్నింగ్‌ కోటా ఓట్లు

పోస్టల్‌ ఓట్లతో కలిసి మొత్తం 2,52,000 ఓట్లు పోలవగా, అందులో సుమారు 28 వేల ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. చెల్లనిఓట్లు పోగా మిగిలిన 2,24,000 ఓట్లలో సగం ఓట్లు.. అంటే 1,12,001 ఓట్లను విన్నింగ్‌ కోటా ఓట్లుగా నిర్ధారించారు. పోటీలో ఉన్న ఏ ఒక్క అభ్యర్థి నేరుగా కోటా ఓట్లను సాధించే పరిస్థితి కానరావడం లేదు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్‌ చేస్తూ రెండోప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఫలితం తేలేందుకు బుధవారం రాత్రి వరకూ సమయం పట్టే అవకాశం ఉందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement