‘ఆడిటర్లను విచారణకు పిలవండి’
వేల్పూర్: నిధుల అవకతవకలపై పదేళ్ల నుంచి ఆడిట్ నిర్వహించిన ఆడిటర్లను విచారణకు పిలవాలని శనివారం విచారణకు వచ్చిన అధికారి మురళికి వేల్పూర్ మండలం పడగల్ సొసైటీ మాజీ డైరెక్టర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్ల కిందట సొసైటీలో నిధుల గోల్‌మాల్ జరిగిందని, దీనిపై సమాధానం చెప్పాలని తమను విచారణకు పిలవడం శోచనీయమన్నారు. ప్రతి సంవత్సరం ఆడిటర్లు నిధుల వినియోగంపై తనిఖీ చేసినప్పుడు అవకతవకలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. వార్షిక ఆడిట్ చేసే ఆడిటర్లు సొసైటీలో జరిగే అవకతవకలపై అప్పుడే చెబితే ప్రశ్నించేవారమన్నారు. తమకు ఆడిట్ వివరాలు చెప్పకుండా ఆమోదింపజేసుకున్నారని విచారణ అధికారికి స్పష్టం చేశారు. తమ పదవీకాలంలో నిధులను తనిఖీ చేసిన ఆడిటర్లు, ఎన్‌డీసీసీ బ్యాంకు మేనేజర్లను విచారణకు పిలిచి, ఎక్కడ పొరపాటు జరిగిందో వెలికితీయాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో మాజీ డైరెక్టర్లు ఎడ్ల రాజేశ్వర్‌రెడ్డి, బ్యాగరి పుణ్యరాజ్, కొంతం దేవన్న, నేరేళ్ల రాజేశ్వర్‌రెడ్డి, బుట్టి మహిపాల్, ఏనుగు శేఖర్‌రెడ్డి ఉన్నారు.
వెల్‌నెస్ సెంటర్
ఏర్పాటుకు కృషి చేస్తా
● ఎంపీ అర్వింద్
నిజామాబాద్ నాగారం: జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ కోసం వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవనంలో శనివారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్స్ వెల్ఫేర్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ సంక్షేమం కోసం పాటు పడుతానని అన్నారు. కార్యక్రమంలో కమిటీ నేతలు అజీ జ్, శ్రావణ్‌కుమార్, మల్లేశ్, సాయరెడ్డి, ఎవీ ఎల్ నారాయణ, గంగాధర్, జ్యోతిరాజ్, మో హన్‌దాస్, జిల్లా అధ్యక్షుడు పీపీ రెడ్డి, కార్యదర్శి షేక్ హుస్సేన్, కామారెడ్డి భిక్షపతి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
చెట్టును ఢీకొన్న కారు
మోపాల్: మండలంలోని తాడెం శివారులో శుక్రవారం రాత్రి కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన మురళీధర్ మోపాల్ నుంచి నిజామాబాద్ వైపు వస్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో మురళీధర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
‘ఆడిటర్లను విచారణకు పిలవండి’
Comments
Please login to add a commentAdd a comment