
పదోన్నతి బాధ్యతను పెంచుతుంది
నిజామాబాద్ రూరల్: పదోన్నతులు ఉద్యోగ జీవితంలో మధుర జ్ఞాపకాలని, ఉపాధ్యాయులకు మరింత బాధ్యతను పెంచుతాయని ఉపాధ్యాయుల కోర్సు డైరెక్టర్, జడ్పీహెచ్‌ఎస్ గూపన్‌పల్లి హెచ్‌ఎం ఎ శకుంతలా దేవి అన్నారు. శుక్రవారం గూపన్‌పల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన తెలుగు ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులకు పాఠ్యపుస్తకాల తాత్వికత, బోధన వ్యూహాలు, సామర్థ్యాల సాధన, అభ్యసన ఫలితాలు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ప్రశ్నాపత్రాలు, మూల్యాంకనం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు మాతృభాషలో ధారాళంగా చదవగలగడం, అర్థం చేసుకొని రాయగలడం, తెలుగు సాహిత్య ప్రక్రియలు రూపొందించగలగడం స్వయంగా చేయాలని సూచించారు. ఈ జ్ఞానం ఇతర విషయాలు నేర్చుకోడానికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఘనపురం దేవేందర్, శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ గంట్యాల ప్రసాద్, ప్రవీణ్ శర్మ, కేసీ లింగం, అజయ్ పాల్గొన్నారు.