అందుబాటులోకి ఎల్‌సీ యాప్‌ | - | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి ఎల్‌సీ యాప్‌

Apr 6 2025 1:08 AM | Updated on Apr 6 2025 1:08 AM

అందుబాటులోకి ఎల్‌సీ యాప్‌

అందుబాటులోకి ఎల్‌సీ యాప్‌

యాప్‌తో

ప్రమాదాల నివారణ!

విద్యుత్‌ లైన్‌ క్లియర్‌లో ఒక ఫీడర్‌ బదులు మరో ఫీడర్‌ను ఎంచుకోవడం, పంపిణీ వ్యవస్థ సరిగ్గా గుర్తు చేసుకోకపోవడం, సమాచార లోపం, తదితర కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది, ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్లు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వీటి నివారణ కోసం ఆన్‌లైన్‌ ఎల్‌సీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. యాప్‌ ద్వారా మానవ తప్పిదాలను పూర్తిగా నివారించొచ్చు. అలాగే అనవసరమైన ఎల్‌సీలు తగ్గించొచ్చు. ఎల్‌సీల సమయాలను గణనీయంగా తగ్గించడమే కాకుండా ఎల్‌సీ తీసుకున్న సమాచారం పైఅధికారులకు వెంటనే తెలిసిపోతుంది. సంబంధిత ఏఈ అనుమతి లేకుండా తీసుకునే ఎల్‌సీలను ఈ యాప్‌ ద్వారా నివారించొచ్చు.

సుభాష్‌నగర్‌: విద్యుత్‌ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఎన్‌పీడీసీఎల్‌ మరో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌ ఎల్‌సీ (లైన్‌ క్లియర్‌) యాప్‌ను ప్రవేశపెట్టింది. ఎల్‌సీలు తీసుకుని పని చేసే సమయంలో మానవ తప్పిదాలు జరుగుతున్న నేపథ్యంలో నూతనంగా తీసుకొచ్చిన యాప్‌ అటు వినియోగదారులకు.. ఇటు ఎన్‌పీడీసీఎల్‌కు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యుత్‌ సరఫరాలో భద్రతా ప్రమాణాలను పెంచేందుకు, విద్యుత్‌ అంతరాయ సమయాలు, మానవ తప్పిదాలను నివారించేందుకు లైన్‌ క్లియర్‌ (ఎల్‌సీ) యాప్‌ను రూపొందించామని ఎన్‌పీడీసీఎల్‌ నిజామాబాద్‌ ఎస్‌ఈ రాపెల్లి రవీందర్‌ తెలిపారు.

లైన్‌ క్లియర్‌ యాప్‌ అమలు విధానం

విద్యుత్‌ సరఫరాలో ఎల్‌సీ తీసుకోవాలనుకున్న లైన్‌మెన్‌ మొదటగా లైన్‌ క్లియర్‌ యాప్‌ ఓపెన్‌ చే యాలి. సంబంధిత ఫీడర్‌లో ఎల్‌సీ కావాలని ఏఈకి విన్నవిస్తారు. ఏఈ లైన్‌మెన్‌ విన్నపాన్ని పరి శీలించి ఆ ఫీడర్‌లో ఎల్‌సీ ఇవ్వొచ్చా.. లేదా అని, అత్యవసర అవసరాలు ఏమైనా ఉన్నాయా లేదా మరే ఇతర షెడ్యూల్‌ చేసిన పనులు ఉన్నాయా అని సమీక్షించుకుంటారు. దాని ప్రకారం ఏఈ ఎల్‌సీ ఇవ్వొచ్చు లేదా నిరాకరించవచ్చు.. ఏఈ ఎల్‌సీకి అనుమతి ఇవ్వగానే సంబంధిత లైన్‌మెన్‌కు సమాచారం అందుతుంది. అలాగే సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌కు ఏ ఫీడర్‌ ఇవ్వాలో యాప్‌ ద్వారా మెసేజ్‌ వస్తుంది. సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌కు ఎల్‌సీ ఇవ్వాల్సిన సమయంలో పొరపాట్లు లేకుండా తగిన సూచనలు, జాగ్రత్తలు హెల్మెట్‌ పెట్టుకోవడం, హ్యాండ్‌ గ్లౌజ్‌ వేసుకోవడం, ఎర్త్‌ రాడ్‌ వేయాలని, ఏబీ స్వీచ్‌ ఓపెన్‌ చేస్తారా లేదా అని యాప్‌ గుర్తు చేస్తుంది. వీటన్నింటిని సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌ చేసి ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే ఆ ఫొటోను యాప్‌ ద్వారా లైన్‌మెన్‌ చూసి.. ఆ ఫొటోలో కనిపిస్తున్న ఫీడర్‌, ఏబీ స్విచ్‌ ఓపెన్‌ చేసారా.. లేదా.. అని ధ్రువీకరించుకుని పనికి ఉపక్రమిస్తాడు. లైన్‌మెన్‌ ఎంతమంది సిబ్బందితో పని చేయిస్తున్నాడో వారి పేర్లు యాప్‌లో పొందుపర్చాలి.

లైన్‌మెన్‌ పని పూర్తి కాగానే ఈ పనికి సంబంధించి ఫొటో, సిబ్బంది వచ్చారా.. లేదా అని యాప్‌లో పొందుపర్చి ఎల్‌సీని రిటర్న్‌ చేస్తారు. సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌కు యాప్‌ ద్వారా ఎల్‌సీ రిటర్న్‌ చేయాలని ఆదేశాలు వెళ్తాయి. రిటర్న్‌ చేసిన ఎల్‌సీ సమాచారం ఏఈకి అందుతుంది. ఏఈ ఆదేశాల మేరకు ఆ ఫీడర్‌లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తారు.

విద్యుత్‌ ప్రమాదాల నివారణకు

ఎన్‌పీడీసీఎల్‌ సేవలు

లైన్‌ క్లియర్‌ అనుమతి నుంచి రిటర్న్‌ వరకు యాప్‌లోనే..

అనవసర ఎల్‌సీలకు చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement