
అప్రమత్తతతోనే నివారణ
ఖలీల్‌వాడి: జిల్లాలో అగ్ని ప్రమాదాల సంఖ్య ప్రతి యేడాది పెరుగుతునే ఉన్నాయి. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటంతో ఈ కాలంలో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనల్లో వల్ల రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. పలు సందర్భాల్లో ప్రాణనష్టం కూడా జరుగుతుంది. ప్రమాదాలను నివారించడానికి అప్రమత్తతే ముఖ్యమని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో అపార్ట్‌మెంట్‌లు, ఆస్పత్రులు, దుకాణ సముదాయాల సంఖ్య పెరిగిపోతున్నాయి. కానీ వీటి యాజమాన్యాలు అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం లేదు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సిబ్బంది ఇచ్చిన సూచనలు తప్పక పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాలో ఏడు ఫైర్ స్టేషన్లు
ప్రమాదాలను నివారించడానికి అగ్నిమాపకశాఖ అప్రమత్తంగా ఉంటోంది. జిల్లాలో ఏడు ఫైర్ స్టేషన్‌లో ఉన్నాయి. దీంతో ప్రమాదాలు సంభవించిన సమయంలో ఫైర్ సిబ్బంది వెంటనే ఫైరింజన్‌తో ఘటన స్థలాలకు వెళ్లి మంటలను ఆర్పివేయడానికి కృషి చేస్తున్నారు. జిల్లాలో నందిపేట్, బాల్కొండ ఫైర్ స్టేషన్‌లు కొత్తగా ఏర్పాటు చేశారు. నిర్లక్ష్యంతోపాటు అవగాహన లేకపోవడంతో అగ్ని ప్రమాదా లు సంభవిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీ టిపై అవగాహన ఉంటే 80నుంచి 90శాతం వరకు ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
ఇటీవల జరిగిన ప్రమాదాలు..
● జిల్లా కేంద్రంలోని పూలాంగ్ చౌరస్తా వద్ద ఉన్న రెండు సామిల్‌ల్లో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు ఫైరింజన్ కు సమాచారం అందించడంతో 4 ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అ ర్పివేశాయి. ఈఘటనలో సుమారు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
● జిల్లా కేంద్రంలోని మార్కండేయ గుడి పక్కన ఫిబ్రవరి 11న ఓ పెంకుటిల్లులోని పూజ గదిలో దీపంతో పక్కన ఉన్న వస్తువులకు మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలు అ ర్పివేశారు. ఇంట్లోని నగదు, బంగారం కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. ఇవే కాకుండా జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఇటీవల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు సర్వస్వం కోల్పోయి, నిరాశ్రయులుగా మారారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
● దుకాణాలలో మండే స్వభావం ఉన్న వస్తువులను పెట్టవద్దు.
● ఇంట్లో ఉండే సిలెండర్‌లకు వేడి తగలకుండా జాగ్రత్తలు పాటించాలి.
● దుకాణాలు, ఇళ్లలో విద్యుత్ తీగలను ఎలుకలు కొరకకుండా జాగ్రత్తలు చేపట్టాలి. అలాగే కరెంట్‌వైర్లు ఒకేచోట ఎక్కువగా ఉంచకుండా, వదులుగా ఉండేలే చర్యలు చేపట్టాలి.
● ఇళ్లు, దుకాణాల్లో వెంటిలేషన్ సరిగా ఉండాలి.
● అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పడు అగ్నిమాపక వాహనాలు తిరిగే విధంగా ఉండాలి. అలాగే అన్ని ఫ్లాట్‌లకు నీరు అందేలా పైపులైన్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
● పంటపొలాల్లో వ్యర్థాలకు నిప్పుపెట్టవద్దు.
జాగ్రత్తలు పాటించాలి
అగ్నిప్రమాదాలపై ఫైర్ సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలని ప్రయోగాత్మకంగా వివరిస్తున్నాం. ఇండ్రస్టీస్‌ల యాజమాన్యాలు, పెద్ద హోటళ్లు, ఆస్పత్రుల నిర్వాహకులకు, అక్కడ పని చేసే సిబ్బందికి పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నాం. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్‌వోసీ తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలి.
– నర్సింగ్‌రావు, ఫైర్ ఆఫీసర్, నిజామాబాద్
జిల్లాలోని ఫైర్ స్టేషన్ల నంబర్లు
నిజామాబాద్ 8712699225
ఆర్మూర్ 8712699229
భీమ్‌గల్ 8712699223
బాల్కొండ 8712685797
నందిపేట్ 8712685799
ఇందల్వాయి 8712699231
బోధన్ 8712699227
సంవత్సరాల వారీగా ప్రమాదాలు
సంవత్సరం ప్రమాదాలు ఆస్తినష్టం ప్రాణనష్టం
2023 252 రూ.4.28 కోట్లు 9
2024 228 రూ.2.78 కోట్లు 21
2025(మార్చ్) 80 రూ.80లక్షల వరకు 1
జిల్లాలో ప్రతియేటా పెరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలు
రూ.లక్షల్లో నష్టం సంభవిస్తున్న వైనం