
కల్తీ కల్లుతో పలువురికి అస్వస్థత
బాన్సువాడ/నస్రుల్లాబాద్: కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ జీజీహెచ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి కల్లు డిపోనుంచి పలు గ్రామాలకు కల్లు సరఫరా అవుతుంది. సోమవారం ఈ కల్లు తాగిన అంకోల్, దుర్కి, దామరంచ గ్రామవాసులు అస్వస్థతకు గురయ్యారు. కల్లు తాగిన తర్వాత కళ్లు తేలేయడం, మెడలు వెనక్కి పడేయడం చేస్తుండడంతో వారిని కుటుంబ సభ్యులు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్రమంగా బాధితులు పెరుగుతుండడంతో డిప్యూటీ డీఎంహెచ్‌వో విద్య అంకోల్ గ్రామానికి వెళ్లి వైద్య సిబ్బందికి సూచనలు ఇచ్చారు. కల్తీ కల్లు బాధితులను వెంటనే ఆస్పత్రికి పంపించాలని ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు సూచించారు. ఆరోగ్య సిబ్బంది స్థానిక గ్రామ పంచాయతీ వద్ద మందులను అందుబాటులో ఉంచారు. బాధితులకు ప్రథమ చికిత్స అందించిన తర్వాత అంబులెన్సులో బాన్సువాడకు పంపిస్తున్నారు. కాగా సోమవారం రాత్రి వరకు 60 మంది కల్తీ కల్లు బాధితులు బాన్సువాడ ఆస్పత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం 12 మందిని నిజామాబాద్ జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చినవారు కల్లు తాగుతారు. ఈ నేపథ్యంలో బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
డిపోలోని కల్లును పరీక్షించామని, అందులో సీహెచ్ శాతం లేదని బాన్సువాడ ఎకై ్సజ్ సీఐ యాదిరెడ్డి తెలిపారు. ఇంకా ఏదైనా మత్తు పదార్థం ఉందేమో తెల్చడానికి శాంపిల్స్ సేకరిస్తున్నామని పేర్కొన్నారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ కల్తీ కల్లు అమ్మి అమయాకుల ప్రాణాలతో చెలగాటమడుతున్న కల్లు దుకాణం నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు.
చికిత్స నిమిత్తం బాన్సువాడ, నిజామాబాద్ ఆస్పత్రులకు తరలింపు
దుర్కి కల్లు డిపో పరిధిలో ఘటన