
మహిళపై వ్యక్తి దాడి
గాంధారి(ఎల్లారెడ్డి): తన కొడుకును కిడ్నాప్ చేసి, దాచిందనే అనుమానంతో ఓ మహిళపై నిందితుడు దాడి చేయగా, తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. చందానాయక్ తండాకు చెందిన కేతావత్ పిరాజీ గత కొన్నేళ్లుగా హైదరాబాద్ బేగంపేట్‌లో ఉంటూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో అమీనాబేగం (35) కూడా భిక్షాటన చేస్తూ జీవనం సాగించేది. పిరాజీ కుమారుడు నాలుగేళ్ల వయస్సుగల శ్రీకాంత్ కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. అమీనా బేగం తన కుమారుడిని కిడ్నాప్ చేసి దాచిందనే అనుమానంతో పిరాజీ ఆమెను ఇటీవల చందానాయక్ తండాకు తీసుకొచ్చాడు. ఆమెను తన కొడుకును ఎక్కడ దాచావో చెప్పాలని ప్రశ్నించాడు. ఆమె వివరాలు చెప్పలేదు. ఈక్రమంలో తండా సమీపంలోని మేడిపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణా రహితంగా కర్రలతో కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి అతడు వెళ్లిపోయాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు గమనించి గాంధారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందింది. మేడిపల్లి మాజీ సర్పంచ్ నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ విచారణ చేస్తున్నారని ఎస్సై తెలిపారు.
తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో
చికిత్స పొందుతూ మృతి
కొడుకును కిడ్నాప్ చేసిందనే అనుమానంతో ఘాతుకానికి పాల్పడిన నిందితుడు
చందానాయక్ తండాలో ఘటన