
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఆక్రమణ
ధర్పల్లి: మండలకేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో ప్రజలు మంగళవారం ఆగ్రహించి, ఇళ్ల తాళాలు తొలగించి, ఆక్రమించుకున్నారు. ధర్పల్లిలో మూడేళ్ల క్రితం 48 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించారు. వీటికోసం పలువురు నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో 30 మంది నిరుపేద కుటుంబాలు ఆగ్రహించి ఇళ్లలోకి ప్రవేశించి, సామగ్రిని భద్రపరుచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇళ్ల పంపిణీ చేయకుండా చొరబడడం చట్టా విరుద్ధమని తహసీల్దార్ మాలతి వారికి తెలిపారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఇళ్లలోకి చొరబడిన వారిని అధికారులు సముదాయించి బయటకు పంపించారు.