
నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయొద్దు
తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయొద్దని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆరవ మహాసభ నిర్వహించారు. ఈసందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలకు పెద్దపీట వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినా ఇప్పటి వరకు ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. వెంటనే తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం 15మంది సభ్యులతో కూడిన తెయూ ఎస్‌ఎఫ్‌ఐ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా శివ, అధ్యక్షుడిగా జీషణ్, వర్సిటీ ఆఫీస్ బేరర్స్‌గా నాగేంద్ర, నిరంజన్, సంధ్య ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దినేష్, కమిటీ సభ్యులు సంతోష్, కొండల్ పాల్గొన్నారు.