
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరివాడు
తెయూ(డిచ్‌పల్లి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరివాడని తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ పేర్కొన్నారు. అంబేడ్కర్ రీసెర్చ్ అండ్ స్టడీ సెంటర్, తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘అంబేద్కర్ జీవితం – నేటి యువతకు ఆదర్శం’ అనే అంశంపై బుధవా రం క్యాంపస్ కళాశాల సెమినార్ హాల్‌లో సదస్సు నిర్వహించారు. సదస్సుకు ప్రధాన వక్తగా హాజరైన అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ.. బాల్యం నుంచి ఉద్యోగం చేసే వరకు కుల వివక్షను ఎదుర్కొన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వాటిని నిర్మూలించడానికి చివరి వరకు పోరాటం చేశారని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఇబ్బంది రావొద్దని భావించి, దేశ పౌరులందరికీ ఒకే రాజ్యాంగం ఉండాలని రాజ్యాంగ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. అంబేడ్కర్ హిందూమతానికి వ్యతిరేకం కాదని, కేవలం హిందూమతంలో ఉన్న సామాజిక వివక్షపై విసుగుచెంది సమరసతను బోధించే బౌద్ధ మతాన్ని స్వీకరించి గౌతమబుద్ధుని మార్గంలో నడిచారని తెలిపారు. కానీ కొందరు అంబేడ్కర్‌ను ఒక కులానికే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. విద్యార్థులందరూ అంబేడ్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజంలో నెలకొన్న సమస్యలపై బాధ్యతాయుతంగా పోరాడాలని తెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ మామిడాల, కమిటీ అధ్యక్షుడు పృథ్వీ, నరేందర్, అశోక్, మనో జ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.