
గౌరవప్రదమైన జీవనం సాగించాలి
నిజామాబాద్‌అర్బన్: వివిధ పరిస్థితుల కారణంగా సమాజంలో దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకుని గౌరవప్రదంగా జీవించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మినీ మోడ్యూల్ క్యాంపు నిర్వహించారు. జిల్లా జడ్జితోపాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ సాయి చైతన్య తదితరులు పాల్గొన్నారు.ఈసందర్భంగా దాతల సహకారంతో పలువురికి కుట్టు మిషీన్లు, ప్రభుత్వ బాలికల పాఠశాలలు, డిచ్‌పల్లి మానవతా సదన్, కస్తూర్బా విద్యాలయాలకు సానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్లు పంపిణీ చేశారు. లేబర్ డిపార్ట్‌మెంట్ తరపున అసంఘటిత రంగ కార్మికులకు గుర్తింపు కార్డులను, మెప్మా ఆధ్వర్యంలో 21 స్వయం సహాయక సంఘాలకు రూ. 2.50 కోట్ల విలువ గల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును అందజేశారు. అనంతరం జిల్లా జడ్జి మాట్లాడుతూ.. డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు చేయూతను సద్వినియోగం చేసుకున్నప్పుడే సేవా కార్యక్రమాలకు సార్థకత చేకూరుతుందన్నారు. సీపీ మాట్లాడుతూ.. లబ్ధిదారులు స్వయం ఉపాధి దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. దాతలను సన్మానించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్‌రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.