
తప్పని ఎదురుచూపులు
ఆలస్యంపై ఆందోళన
ప్రభుత్వం పరిధిలో పని చేయాలని ఆశించిన వారు మెరిట్ జాబితా రూపకల్పన జాప్యం కా వడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది గడిచినా స్టాఫ్‌నర్స్, ఏఎన్ ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌లో కన్నా ప్రభుత్వ శాఖలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అయినా ఉద్యోగానికి కొంత భరోసా ఉంటుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.
నిజామాబాద్‌నాగారం: వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్‌నర్స్, ఏఎన్‌ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. 30 స్టాఫ్‌నర్స్, మూడు ఏఎన్‌ఎం పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ అయ్యింది. స్టాఫ్‌నర్స్ పోస్టులకు 876 మంది. ఏఎన్‌ఎం పోస్టులకు 328 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరూ 14 నెలలుగా వైద్యారోగ్యశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అప్పటి డీఎంహెచ్‌వో సుదర్శనం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో కాలయాపన చేశారని, మెరిట్ జాబితాను రూపొందించలేదనే ఆరోపణలున్నాయి.
ఆ తరువాత సుదర్శనం రిటైర్ కావడం, పార్లమెంట్ ఎన్నికల కోడ్, మూడు నెలలపాటు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో కొనసాగడం తదితర కారణాలతో పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యం నెలకొంది. 2024 ఆగస్టులో డీఎంహెచ్‌వోగా రాజశ్రీ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఉద్యోగుల బదిలీలు, పట్టభద్రుల ఎన్నికల కోడ్ కారణంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు.
మాకు అవకాశం ఇవ్వండి..
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో సేవలందించిన తమకు అవకాశం కల్పించాలని తొమ్మిది మంది స్టాఫ్ నర్సులు కోరుతున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులను కలిసి విన్నవించగా వారు ఓకే చెప్పారు. ఆ తరువాత జి ల్లా కలెక్టర్‌తోపాటు డీఎంహెచ్‌వోను సైతం నర్సు లు కలిసి విన్నవించారు. ఐదేళ్లపాటు జీజీహెచ్‌లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించామని, కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేసినందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూనే ఉన్నారు. కరోనా సమయంలో విధులు నిర్వర్తించిన వారికి వేరే జిల్లాల్లో అవకాశం ఇచ్చారని, ఇక్కడ కూడా ఇవ్వాలని అంటున్నారు.
ముందుకు సాగని కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్, ఏఎన్‌ఎం పోస్టుల భర్తీ
మరింత ఆలస్యమవుతున్న
నియామకాల ప్రక్రియ
కరోనా కాలంలో సేవలందించిన వారికి అవకాశం ఇవ్వాలని వినతి
అనుమతి రాగానే భర్తీ చేస్తాం
మెరిట్ జాబితా సిద్ధం చేశాం. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతా ఏడాది గడిస్తే ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అనుమతి కోసం లేఖ రాయడం జరిగింది. కరోనా సమయంలో విధులు నిర్వర్తించిన వారి విషయాన్ని కూడా ఉన్నతాధికారులకు విన్నవించాం. అనుమతి రాగానే వెంటనే భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం.
– బద్దం రాజశ్రీ, డీఎంహెచ్‌వో