
నందిపేటలో ధాన్యం బస్తాల చోరీ
నందిపేట్(ఆర్మూర్): వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి రైస్‌మిల్‌కు లారీ తరలిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ చోరీ చేసిన ఘటన నందిపేట మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నందిపేట మండలం చింరాజ్‌పల్లి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఆదివారం డొంకేశ్వర్ మండలం నూత్‌పల్లి గ్రామంలోని రాజరాజేశ్వర రైస్‌మిల్‌కు తరలించారు. మార్గమధ్యలో నందిపేట వద్ద డ్రైవర్ లారీని నిలిపి, కొన్ని ధాన్యం బస్తాలను ఆటోలో ఎక్కించాడు. ఈ తతంగాన్ని స్థానికులు అనుమానంతో వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ అయింది. వీడియోను చూసిన రైతులు సొసైటీకి వెళ్లి అధికారులను అడగడంతో తాము కూడ లారీ ఇంకా రైస్‌మిల్‌కు చేరలేదని ఆందోళన చెందుతున్నామన్నారు. అనంతరం అధికారులు రైతులతో కలిసి ఘటన స్థలానికి వెళ్లి లారీ డ్రైవర్‌ను నిలదీయగా, చోరీని ఒప్పుకున్పాడు. గత మూడు రోజుల నుంచి ఇలాగే లారీలో బస్తాలు తక్కువగా రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.