
కల్యాణలక్ష్మి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దు
● చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని
రద్దు చేయడం సరికాదు
● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యం చే స్తూ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొదని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చెక్కుల పంపిణీ ఇప్పటికే నెల రోజులు ఆపడమే కాకుండా, మంత్రి జూపల్లి కృష్ణారావుచే ఏర్పా టు చేయించిన పంపిణీ కార్యక్రమాన్ని కూడా రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. వేల్పూర్‌లోని బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ జీవో18 ప్రకారం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసే అధికారం పూర్తిగా ఎమ్మెల్యేలకు మాత్రమే ఉందని, సంబంధిత జీవోను ప్రదర్శించారు. అయినప్పటికీ మంత్రితో కలిసి మంగళవారం చెక్కుల పంపిణీకి సిద్ధం కాగా, కార్యక్రమం రద్దయినట్లు అధికారులు చెప్పారన్నారు. తనకున్న అధికారంతో చెక్కులు పంపిణీ చేస్తానని కలెక్టర్, ఆర్మూర్ ఆర్డీవోకు తెలుపగా, మంత్రి చేతనే పంపిణీ చేస్తారని తెల్పడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికే ఆలస్యం అయినందున నేరుగా చెక్కులను జీపీ కార్యదర్శుల ద్వారా లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.