
అనర్హులకు కార్డులిస్తే ఉద్యోగం ఊస్ట్
మోర్తాడ్(బాల్కొండ): ఆహార భద్రత కొత్త కార్డులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్య లు చేపడుతోంది. రేషన్‌కార్డుల కోసం అందిన దరఖాస్తులను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించాలని ఉద్యోగులను ఆదేశించింది. అనర్హులకు రేషన్‌కార్డులు అందకుండా మరోసారి సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే నిర్వహించే ఉద్యోగులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, అనర్హులకు రేషన్‌కార్డులు జారీ అయితే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. గతంలో జారీచేసిన రేషన్‌కార్డులలో అనేక మంది అనర్హులు స్థానం సంపాదించుకొని ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారు. వారి నుంచి కార్డులను స్వాధీనం చేసుకునే విషయం ఎలా ఉన్నా ఇప్పుడు కొత్తగా జారీ చేసే కార్డుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
నేటి నుంచి కొనసాగనున్న సర్వే
గణతంత్ర దినోత్సవం రోజున జిల్లాలోని ఒక్కో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పలువురికి కొత్త కార్డులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల నుంచి వచ్చి న మెజార్టీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడంతో వీటిపై మరోమారు సర్వే నిర్వహిస్తోంది. గడిచిన వారంలోనే సర్వే నిర్వహించాల్సి ఉన్నా రెవెన్యూ అధికారుల మొబైల్ యాప్‌లలో లాగిన్ ఇవ్వడం, ఇతరత్రా అంశాల విషయంలో కొంత జాప్యం జరిగింది. వరుసగా సెలవులు రావడంతో ఈ నెల 15 నుంచి పక్కాగా సర్వే నిర్వహించాలని అధికారులు క్షేత్రస్థాయి ఉద్యోగులకు నిర్దేశించారు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉద్యోగులతోపాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు ఈ సర్వే బాధ్యత అప్పగించారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు కొత్త కార్డుల కోసం 81,148 దరఖాస్తులు రాగా, 1,066 కుటుంబాలకే కొత్త కార్డులను అందజేశారు. ఇంకా 80వేలకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం.
రేషన్‌కార్డు దరఖాస్తుల వడపోత
అర్హుల ఎంపికకు పకడ్బందీ చర్యలు
క్షుణ్ణంగా సర్వే నిర్వహించాలని
ఉద్యోగులకు సర్కారు ఆదేశాలు
సర్వే పక్కాగా నిర్వహించాలి
కొత్త రేషన్‌కార్డుల జారీకి ముందు ఉద్యోగులు పక్కాగా సర్వే నిర్వహించాలి. ఎవరైనా ఒత్తిడి చేస్తే ఆ విషయం మా దృష్టికి తీసుకురావాలి. తప్పుడు వివరాలను సర్వేలో నమోదు చేయొద్దు. కొత్తగా జారీ చేసే కార్డులు నూటికి నూరు శాతం అర్హులకే దక్కాలి. – కృష్ణ, తహసీల్దార్, మోర్తాడ్
నిబంధనలు
కారు ఉండొద్దు.
సాగు భూమి 3.50 ఎకరాలలోపు ఉండాలి.
సాగుకు యోగ్యంకాని భూమి 7.50 ఎకరాల వరకు ఉండొచ్చు.
సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాలకు రూ.2లక్షలకు మించొద్దు.
ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులు, ఉద్యోగ విరమణ పింఛన్ పొందుతున్నవారు అనర్హులు.