
పగలు డంప్.. రాత్రి జంప్
మోర్తాడ్: ఇసుక అక్రమ దందాకు కేరాఫ్ అడ్రస్‌గా భీమ్‌గల్ నిలుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని కప్పలవాగు, పెద్దవాగుల శివారు నుంచి కొందరు ఇసుకాసురులు పగటి పూట ట్రాక్టర్‌లతో డంప్ చేసి రాత్రిపూట పెద్ద పెద్ద లారీల్లో పొరుగు ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు చేసి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని చూస్తున్నా అక్రమార్కులు తమ బుద్ధి మార్చుకోవడం లేదు. తాజాగా బడాభీమ్‌గల్ శివారులోని వాగు నుంచి ఇసుకను ఒక చోట డంప్ చేయగా శనివారం అధికారులు సీజ్ చేశారు. అసలు విషయానికొస్తే కొన్ని నెలల నుంచి పగటి పూట స్థానిక అవసరాల కోసం ఇసుకను తరలించేందుకు కొందరు వ్యాపారులు అధికారుల నుంచి అనుమతి పొందుతున్నారు. తవ్విన ఇసుకను కొందరి విక్రయించి, పెద్ద మొత్తంలో నిలువ చేస్తున్నారు. ఈ నిలువలను రాత్రిపూట ఒక్కో లారీ లోడ్‌కు రూ.40వేల వరకూ వసూలు చేసుకొని తరలిస్తున్నట్లు సమాచారం.
అక్రమ దందాలో ఒక్కటైన నాయకులు
ఇసుక అక్రమ రవాణాపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకూడదనే ఉద్దేశ్యంతో ఆయా గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒక్కటైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇసుక తరలించేందుకు గ్రామాభివృద్ధి కమిటీలు నిర్వహించే వేలం పాటల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు పాల్గొని తక్కువ ధరకు టెండర్ ఒకే చేసుకున్నట్లు సమాచారం. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులు అడ్డు చెప్పకుండా ఉండేందుకు వారిని కూడా ఈ అక్రమ దందాలో భాగస్వాములను చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బహిరంగంగా ఒక పార్టీపై మరో పార్టీ నాయకులు విమర్శలు చేసుకుంటున్నా.. అక్రమంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకునే అంశంలో చేతులు కలిపినట్లు బలంగా వినిపిస్తుంది. భీమ్‌గల్ మండలంలోని వివిధ గ్రామాలలో జోరుగా ఇసుక దందా సాగడమే కాకుండా అక్రమ వ్యాపారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కలిసిపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు.
ఇసుక అక్రమ దందాకు
కేరాఫ్‌గా భీమ్‌గల్
కప్పలవాగు, పెద్దవాగుల నుంచి
పగలు నిల్వ చేసి రాత్రి ఇతర
ప్రాంతాలకు తరలిస్తున్న వ్యాపారులు
అధికారులు దాడులు చేస్తున్నా
ఆగని ఇసుక రవాణా