
మంజీర తీరాన ఆధ్యాత్మిక శోభ
బోధన్: సాలూర మండలం మందర్నాలో బుధవారం అనంత విభూషిత జగద్గురు రామానందచార్య దక్షిణ పీఠం నానీజ్‌ధాం పీఠాధిపతి స్వామి నరేంద్రచార్య పాదుక దర్శన కార్యక్రమాన్ని జిల్లా స్వ–స్వరూ్‌ప్ సాంప్రదాయ్ సేవా సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. మహారాష్ట్ర, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి నామ స్మరణతో సభ మారుమోగింది. గ్రామ శివారులోని కాశీనాథ శివాలయం వద్ద స్వామి వారి పాదుకాలకు పూజ చేసి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంలో ఉంచి శోభాయాత్రను ప్రారంభించారు. వేదిక పై గురుపూజ, ఉపాసక దీక్ష, మంగళహారతి వేడుకను నిర్వహించారు. అనంతరం నానీజ్‌ధాం పీఠం ప్రతినిధులు ప్రవచనాలు చేశారు. సమాజంలో ఆధ్మాత్మిక జ్ఞానం, సామాజిక సేవా దృక్పథం పెంపొందించి లోక కల్యాణార్థం స్వామి వారి పాదుకా దర్శన కార్యక్రమం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు కకసాహేబ్ వన్సారే, సుధాకర్ అడ్కినే, లోచన్ రౌత్ సాహేబ్, గోవింద్ ఉపాసే, సాయినాథ్ ఖథాల్, సాయి ముప్డి, గంగాధర్, మందర్నా రవి, ప్రదీప్ గుప్తా, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.