
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
ఖలీల్‌వాడి: గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి శుక్రవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి వస్తున్న గూడ్స్ రైలు డిచ్‌పల్లి పరిధిలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయస్సు 40 ఏళ్ల వరకు ఉంటాడని, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడి ఫొటో ఆధారంగా ఎవరికై నా సమాచారం తెలిస్తే 8712658591 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
జీవితంపై విరక్తితో మరొకరు..
కామారెడ్డి క్రైం: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివోళ్ల చిన్నగంగయ్య(55) కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధించేవాడు. గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అతను కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. శుక్రవారం ఉదయం తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.